Former Chief Minister: రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ABN , First Publish Date - 2022-09-20T16:54:02+05:30 IST

రాజధాని బెంగళూరు నగరం(Bangalore city)లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గానీ తాను సీఎంగా

Former Chief Minister: రాజకీయాల నుంచి తప్పుకుంటా..

                                        - మాజీ సీఎం కుమారస్వామి సవాల్‌


బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరం(Bangalore city)లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గానీ తాను సీఎంగా ఉన్నప్పుడు అడ్డుకోలేదని జేడీఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పష్టంచేశారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ధిని తాను అడ్డుకున్నట్లు నిరూపిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్‌ విసిరారు. భారీ వర్షాల అనంతరం నగర ప్రజల ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కబ్జాల తొలగింపు నాటకం ప్రారంభించిందన్నారు. అక్కడక్కడా నాలుగు కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేసి చేతులు దులుపుకోవడం కాదని, ప్రభుత్వానికి దమ్ముంటే గత పాతికేళ్లుగా రాజధానిలో చోటు చేసుకున్న అక్రమాలను సరిదిద్ది ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధానిలోని వర్షపీడిత ప్రాంతాల్లో మొక్కుబడిగా సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు.


మంత్రి పదవికి సోమశేఖర్‌ రాజీనామా చేయాలి

అవినీతికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన నేపథ్యంలో మంత్రి పదవికి ఎస్‌టీ సోమశేఖర్‌(ST Somasekhar) రాజీనామా చేయాలని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్‌ చేశారు. విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఆయన పదవి నుంచి తక్షణం తప్పుకుంటనే మంచిదన్నారు. మంత్రి సోమశేఖర్‌ విషయంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదన్నారు. కాగా శాసనసభలో మంగళవారం ఒక వేళ స్పీకర్‌ అనుమతిస్తే ఓ భారీ కుంభకోణాన్ని ఆధారాలతో సహా ప్రవేశపెడతానని ఆయన ప్రకటించారు.

Updated Date - 2022-09-20T16:54:02+05:30 IST