బీజేపీకి షాక్.. గోవా మాజీ సీఎం రాజీనామా

ABN , First Publish Date - 2022-01-22T22:16:23+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల వేళ గోవాలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో..

బీజేపీకి షాక్.. గోవా మాజీ సీఎం రాజీనామా

పనజి: అసెంబ్లీ ఎన్నికల వేళ గోవాలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికిగురైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీలోని పదవులన్నింటికీ ఆదివారంనాడు రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. మాండ్రెం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.


''నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చు. నావద్ద ప్రజల టిక్కెట్ ఉంది. ప్రజలు పోటీ  చేయమని కోరుకుంటున్నారు. అందుకోసం నేను సిద్ధమవుతున్నాను. పార్టీకి చెందిన పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు రెండు రోజులు సమయం కోరాను. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను'' అని పర్సేకర్ మీడియాకు తెలిపారు. రెండు, మూడు పార్టీలు తనను సంప్రదించినప్పటికీ తాను నిరాకరించినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆశలు లేవన్నారు. పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ అభ్యర్థులను బీజేపీలోకి తీసుకుంటున్నట్టు గత పర్యాయంఅమిత్‌షా చెప్పారని, అయితే అలాంటిదేమీ జరగలేదని, గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు.


లక్ష్మీకాంత్ పర్సేకర్ 2014 నవంబర్‌లో గోవా సీఎంగా చేశారు. అప్పటివరకూ గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను దేశ రక్షణ మంత్రిగా కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో పర్సేకర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సాప్టే చేతిలో మాండ్ర నియోజకవర్గంలో 4,000 ఓట్ల తేడాతో పర్సేకర్ ఓడిపాయారు.

Updated Date - 2022-01-22T22:16:23+05:30 IST