‘గురువు’ సంకల్ప గుడి

ABN , First Publish Date - 2021-01-25T16:19:41+05:30 IST

సంకల్ప బలం ఉంటే సాధించలేనిది లేదని..

‘గురువు’ సంకల్ప గుడి

ఫలించిన తాజా మాజీ హెచ్‌ఎం శ్రీనివాసరావు కృషి

పెదబొడ్డేపల్లి జెడ్పీహెచ్‌ స్కూల్‌లో ప్రత్యేక చొరవతో సౌకర్యాలు

ప్రభుత్వ నిధులతో పాటు పూర్వ విద్యార్థుల నుంచి నిధుల సేకరణ

రూ.5 లక్షల వరకు సొంత డబ్బు ఖర్చు

గత డిసెంబరు 31న రిటైరైనా మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి


నర్సీపట్నం(విశాఖపట్నం): సంకల్ప బలం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించారు ఓ తాజా మాజీ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు. 2019 ఏప్రిల్‌ 23న అప్పట్లో తాను పనిచేస్తున్న పెదబొడ్డేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు ఓ కాంట్రాక్టర్‌ వచ్చాడు. పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయని, పనులు ఆరంభించాలని హెచ్‌ఎంతో చెప్పాడు. ఆ తరువాత పాత భవనంలోని ఐదు తరగతి గదులను ఎక్స్‌కవేటర్‌ సహాయంతో  కూల గొట్టాడు. అనంతరం పునాదులు తీయించాడు. ఇంతలో సాధారణ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు పనులు ముందుకు సాగలేదు. ఉన్నతాధికారులను అడిగితే పనులకు పరిపాలనా పరమైన అనుమతులు లేవని చెప్పారు. దీంతో పాఠశాలలో 550 మంది విద్యార్థులకు రెండే తరగతి గదులు ఉండడంతో వారిని వరండాలు, వేదిక మీద కూర్చోబెట్టి పాఠాలు చెబుతూ విద్యా సంవత్సరం నెట్టుకువచ్చారు. పాఠశాల పరిస్థితిని జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి పదేపదే తీసుకు వెళ్లడంతో చివరకు ఆయన కృషి ఫలించి ఎస్‌ఎస్‌ఏ నిధుల నుంచి రెండు తరగతి గదులకు రూ.19.5 లక్షలు మంజూరయ్యాయి.


రెండు తరగతి గదులు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉండగా.. రెండు శ్లాబులు వేసి, సెల్లార్‌ ఖాళీగా ఉంచితే పిల్లలు ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగపడుతందని అధికారులను ఒప్పించారు. ఈ విధంగా నిర్మాణం చేస్తే నష్టం వస్తుందని చెప్పి కాంట్రాక్టర్‌ రెండు శ్లాబులు వేసి నిర్మాణం మధ్యలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయిన ప్పటికీ హెచ్‌ఎం శ్రీనివాసరావు అధికారులను ఒప్పించి మేస్త్రీల ద్వారా తాను అనుకున్న విధంగా సెల్లార్‌ ఖాళీగా ఉంచి పైఅంతస్తులో రెండు తరగతి గదులు నిర్మాణం పూర్తి చేయించారు.  పూర్వ విద్యార్థుల సహకారంతో టైల్స్‌ వేయించి, చుట్టూ గ్రిల్స్‌ అమర్చారు. నిర్మాణం పూర్తి చేసినప్పటికీ రూ.8.74 లక్షలు మాత్రమే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆయన చేతి డబ్బులు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంతలో నాడు-నేడు పథకంలో రూ.61 లక్షలు మంజూరు కావడంతో అధికారులను ఒప్పించి కొత్తగా మూడు అదనపు తరగతి గదులు నిర్మాణం చేయించారు. మిగిలిన డబ్బులతో కొత్తగా నిర్మించిన తరగతి గదులకు పనులు చేయించారు. ఆడపిల్లలకు, మగ పిల్లలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మాణం చేశారు. గత ఏడాది డిసెంబరు 31న ఆయన పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రోజూ పాఠశాలకు రోజూ వస్తూనే ఉన్నారు. 

Updated Date - 2021-01-25T16:19:41+05:30 IST