మాజీమంత్రి అవినీతి వ్యవహారం ...

ABN , First Publish Date - 2022-06-26T18:49:38+05:30 IST

అడయార్‌, జూన్‌ 25: గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన ఎస్పీ వేలుమణి అవినీతికి పాల్పడినట్టు గుర్తించిన ఏసీబీ తదుపరి చర్యలకు

మాజీమంత్రి అవినీతి వ్యవహారం ...

పలువురు ఐఏఎస్ ల  మెడకు ఉచ్చు ?

వేలుమణికి సహకరించారంటూ ఆరోపణలు

సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ ?

అడయార్‌, జూన్‌ 25: గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన ఎస్పీ వేలుమణి అవినీతికి పాల్పడినట్టు గుర్తించిన ఏసీబీ తదుపరి చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఆ సమయంలో ఆయనకు సహకరించిన పలువురు ఐఏఎస్‌ అధికారులపై కేసు నమోదుకు సన్నాహాలు మొదలుపెట్టింది. చెన్నై, కోయంబత్తూరు నగర పాలక సంస్థల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కేటాయించిన టెండర్లలో ప్రభుత్వ ఖజానాకు రూ.800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై రాష్ట్ర అవినీతి నిరోధశాఖ అధికారులు మాజీ మంత్రి వేలుమణికి చెందిన కార్యాలయాలు, గృహాల్లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆయన సొంతకంపెనీలకు టెండర్లు ఇచ్చినట్లు తేలింది. అలాగే 2017-18 మధ్యకాలంలో నగర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు పద్దతిలో నర్సుల నియామకం కోసం వేసిన టెండర్లలో కూడా అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ టెండర్లను కూడా ఏమాత్రం అనుభవం లేని ఓ సంస్థకు కేటాయించినట్టు ఏసీబీ నిర్థారించింది. అయితే, మంత్రి హోదాలో వేలుమణి భారీగా అవినీతికి పాల్పడేందుకు నలుగురు ఐఏఎస్‌ అధికారులతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు సహకరించినట్టు తేలినట్లు సమాచారం. మొత్తం 12 మంది ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలను ఏసీబీ సేకరించి, వారిపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాసినట్టు తెలిసింది. మాజీ మంత్రి వేలుమణి అవినీతి కేసులో పది వారాల్లో తుది నివేదిక తయారు చేసి సమర్పించాలని 2021 నవంబరులో మద్రాస్‌ హైకోర్టు ఏసీబీని ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వేలుమణి అవినీతి కేసులో సంబంధం ఉన్న అధికారులపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వేలుమణి అవినీతిపై ఏసీబీ తయారు చేసే నివేదికలో నలుగురు ఐఏఎ్‌సలు, 12 మంది ఉన్నతాధికారుల పేర్లను చేర్చనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2022-06-26T18:49:38+05:30 IST