పైశాచిక ఆనందంలో సీఎం జగన్: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2021-04-23T18:02:23+05:30 IST

సీఎం జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...

పైశాచిక ఆనందంలో సీఎం జగన్: దేవినేని ఉమా

విజయవాడ: సీఎం జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షనేతలను తొక్కిపెట్టడం ద్వారా ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ప్రజలంతా కరోనాతో బిక్కుబిక్కుమంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. తెల్లవారుజామున  ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికెళ్లి, ఒక బందిపోటుని, గూండాను అరెస్ట్ చేసినట్లు ఆయన్ని అరెస్ట్ చేశారన్నారు. సంగం డెయిరీని స్థాపించి పాడిరైతులకు అండగా ఉండటమే నరేంద్ర చేసిన తప్పా? సంగం డెయిరీని రూ.1100కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లడమే నరేంద్ర చేసిన తప్పా? ప్రభుత్వం తప్పుడు కేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో, ముఖ్యమంత్రి ఆయనపై కక్ష కట్టారన్నారు. 


అమూల్‌ను భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి, నరేంద్రను లక్ష్యంగా ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. సంగం డెయిరీలో లేని అవినీతిని ఉన్నట్లుచూపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అక్రమ కేసులు, తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి ఒక శాడిజంతో, పైశాచిక ఆనందంతో, సైకోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భూముల వ్యవహరంలో చంద్రబాబునాయుడు, మాజీమంత్రి నారాయణలపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని నరేంద్ర ఆధారాలతో సహా నిరూపించారన్నారు. దాంతో ముఖ్యమంత్రి నరేంద్రను టార్గెట్‌‌గా చేశారన్నారు. నరేంద్రను తక్షణమే మీడియాసాక్షిగా కోర్టులో హాజరుపరచాలని, లేకుంటే టీడీపీ తరుపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన దోపిడీకోసం జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌గా మార్చేశారని, అంచనా వ్యయాన్ని పెంచి రాత్రికి రాత్రి జీవోలిచ్చి, రూ.3222కోట్లకు ఎసరు పెట్టారన్నారు. అమరావతిని నిర్వీర్యంచేసిన జగన్మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు పోలవరంపై పడిందని, ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే కరోనాతో బాధపడుతున్న రోగులవద్దకు రావాలని, వైరరస్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రినైనా ముఖ్యమంత్రి ఎందుకు సందర్శించడంలేదని, కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-23T18:02:23+05:30 IST