దేవినేని ఉమకు ఊరట

ABN , First Publish Date - 2021-04-23T10:20:04+05:30 IST

‘‘మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారంలో అరె్‌స్టతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. దర్యాప్తు కొనసాగించవచ్చు’’ అని సీఐడీని

దేవినేని ఉమకు ఊరట

అరెస్టు, ఎలాంటి తొందరపాటు చర్యలూ వద్దు

కేసు దర్యాప్తు చేస్తున్న అధికారిని మార్చండి

సీఐడీకి హైకోర్టు ఆదేశం

మాజీ మంత్రి 29న మంగళగిరిలో 

విచారణకు హాజరు కావాలని ఉత్తర్వు


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారంలో అరె్‌స్టతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. దర్యాప్తు కొనసాగించవచ్చు’’ అని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ పురోగతిని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి సీహెచ్‌ రవికుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రిని ఆదేశించింది. విచారణను మే 7కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో వైసీపీ లీగల్‌ సెల్‌ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్‌.నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దానిని కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ‘‘తిరుపతిలో వీడియో ప్రదర్శిస్తే... మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు సీఐడీ అధికారి దర్యాప్తు చేస్తున్నారు. 


నిబంధనలకు విరుద్ధంగా విచారణ పురోగతిపై పత్రికా ప్రకటన విడుదల చేశారు’’ అని తెలిపారు. న్యాయమూర్తి ఇదేమిటని ప్రశ్నించగా.. సీఐడీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం బదులిస్తూ... ‘‘తిరుపతి.. కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఉన్నందున అక్కడ డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి కార్యాలయంలో విచారణకు అభ్యంతరం లేదు’ అని తెలిపారు.  అనంతరం న్యాయమూర్తి పై ఆదేశాలిచ్చారు.

Updated Date - 2021-04-23T10:20:04+05:30 IST