‘నిమ్మల’ంగా ఉన్నందుకేనా పిలుపు..!

ABN , First Publish Date - 2021-08-13T06:43:22+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి..

‘నిమ్మల’ంగా ఉన్నందుకేనా పిలుపు..!
చంద్రబాబును కలిసిన మాజీఎంపీ నిమ్మల కిష్టప్ప

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ నిమ్మల 


అనంతపురం(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు పిలుపొచ్చింది. ఆ నేపథ్యంలో... మాజీ ఎంపీ గురువారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. దాదాపు అరగంటపాటు అధినేతతో మాట్లాడారు. నిమ్మల కిష్టప్ప గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో అడపాదడపా పాల్గొనడం మినహా చురుగ్గా వ్యవహరించడం లేదు. నిమ్మలంగా ఉంటున్నందుకే ఆయనకు చంద్రబాబు నుంచి పిలుపొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక కారణమైనప్పటికీ... పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, నిమ్మల మధ్య రాజకీయ విభేదాలు కూడా మరో కారణమై ఉండొచ్చన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.


రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఆయన స్తబ్ధుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంటీముట్టనట్లుగా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడంలోనూ చురుగ్గా వ్యవహరించలేదన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. తనకు అనుకూలమైన కొందరి కోసమే ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీకే పార్థసారథితో విభేదాలే ప్రధాన కారణమని పార్టీ వర్గాలు ఆది నుంచి చెబుతూ వస్తున్నాయి. ఇటీవల నిమ్మల సొంత మండలం గోరంట్లలో పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన సందర్భంలోనూ ఇరువురు నేతలూ ఎడమొహం... పెడమొహంగా ఉండటంతో స్థానిక నాయకులు వారిద్దరిని కలిపేందుకు ప్రయత్నించినప్పటికీ అవి విఫలమయ్యాయి. 


అదే మండలంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌లుగా గెలుపొందిన ఓ సర్పంచ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇరువురి నేతలను ఆహ్వానించారు. బీకే ఆ కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత... నిమ్మల నింపాదిగా వచ్చినట్లు సమాచారం. ఇలా ఇద్దరూ ఒకే వేదికపై కలవడానికి కూడా ఇష్టపడని రీతిలో వారి మధ్య విభేదాలు ఉన్నాయన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిమ్మల కిష్టప్పను పిలిపించి ఉంటారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాదాపు అరగంట పాటు నిమ్మల కిష్టప్పతో మాట్లాడిన ఆయన పార్టీలో చురుగ్గా పనిచేయడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పినట్లు సమాచారం. అధినేత ఎందుకు పిలిచారని నిమ్మల కిష్టప్పను ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా... ఊరికే రమ్మన్నాడని ఆయన చెప్పడం గమనార్హం. 

Updated Date - 2021-08-13T06:43:22+05:30 IST