India Vs Pakistan : భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలివీ..

ABN , First Publish Date - 2022-08-16T01:20:28+05:30 IST

భారత్ వర్సెస్ పాకిస్తాన్(India Vs pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తారు.

India Vs Pakistan : భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలివీ..

ముంబై : భారత్ వర్సెస్ పాకిస్తాన్(India Vs pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇక ఇరుదేశాలకు చెందిన అభిమానులైతే భావోద్వేగానికి గురవుతారు. మ్యాచ్ రోజు పనులన్నీ వాయిదా వేసుకుని మరీ టీవీలకు అతుక్కుపోతారు. భారీ క్రేజ్ ఉంటుంది కాబట్టే మ్యాచ్‌కు ముందు నుంచే మాజీ క్రికెటర్ల విశ్లేషణలు, అంచనాలు వెలువడతాయి. ఆసియా కప్ 2022లో ఆగస్టు 28న భారత్ - పాకిస్తాన్  తలపడబోతున్న నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్(Salman Butt) ఆసక్తికరంగా స్పందించాడు. 


త్వరలోనే ఆరంభమవనున్న ఆసియా కప్‌ 2022(Asia Cup)లో భారత(India) జట్టే ఫేవరెట్ అని సల్మాన్ భట్ అంచనా వేశాడు. భారత జట్టులో అనుభవమున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, అందుకే ఆసియా కిరీటాన్ని భారత్ నిలబెట్టుకోగలదని జోస్యం చెప్పాడు. ‘‘ ఔను.. భారత్ ఆసియా కప్ గెలవగలదు. వాళ్లకేమైనా విటమిన్ సీ తక్కువా(నవ్వుతూ..). క్రికెట్ ఆడుతున్న విధానం, అనుభవమున్న ఆటగాళ్ల కూర్పుతో కూడిన భారత్ ఫేవరెట్ టీమ్‌గా కనిపిస్తోంది ’’ అని భట్ అన్నాడు. అయితే తనదైన రోజున పాకిస్తాన్ ఎలాంటి జట్టునైనా మట్టికరిపించగలదని హెచ్చరించాడు. ఇక అఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయలేమని, సులభంగా వికెట్లు తీయగలిగే బౌలర్లు ఉండడంతో అఫ్ఘాన్ కూడా ఆసియా కప్ రేసులో ఉందని భట్ పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో భట్ ఈ మేరకు పేర్కొన్నాడు. కాగా చివరి రెండు ఆసియా కప్ ఎడిషన్లను భారత్ తన ప్రధాన ఆటగాళ్లను బరిలోకి దింపకుండానే టైటిల్స్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.  


ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ మొదలవనుంది. వాస్తవానికి శ్రీలంక అతిథ్యమివ్వాల్సి ఉన్నా ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కారణంగా వేదిక మార్పు అనివార్యమైంది. ఆసియా కప్ 2022 గ్రూప్-ఏలో భారత్‌తోపాటు పాకిస్తాన్ ఉంది. ఇక గ్రూప్- బీలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీలో జట్లు సూపర్-4 కోసం పోటీపడనున్నాయి. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌‌లో జరగనున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-16T01:20:28+05:30 IST