Virat Kohli: కోహ్లీ తన తీరు మార్చుకుంటే.. నేను మ్యాచ్‌లు చూస్తా: పాకిస్థాన్ మాజీ పేసర్

ABN , First Publish Date - 2022-08-14T02:31:29+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై గత కొంతకాలంగా కొనసాగుతున్న చర్చ ఇటీవల మరింత ఎక్కువైంది..

Virat Kohli: కోహ్లీ తన తీరు మార్చుకుంటే.. నేను మ్యాచ్‌లు చూస్తా: పాకిస్థాన్ మాజీ పేసర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై గత కొంతకాలంగా కొనసాగుతున్న చర్చ ఇటీవల మరింత ఎక్కువైంది. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కోహ్లీ మైదానంలోకి వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరుతున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అభిమానులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2019 తర్వాతి నుంచి ఇప్పటి వరకు కోహ్లీ చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. విరాట్ ఫామ్‌పై తాజాగా స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావెద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి, పాక్ బ్యాటింగ్ స్టార్ బాబర్ ఆజం, ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్, కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ మధ్యనున్న తేడా గురించి వివరించాడు.


గ్రేట్ ప్లేయర్లు రెండు రకాలని పేర్కొన్న ఆకిబ్.. కొందరు బలహీనత వద్ద ఆగిపోతారని అన్నాడు. అన్ని బంతులను బాగానే ఆడినా కొన్ని ప్రాంతాల్లో పడిన బంతులను ఆడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. రెండో రకం వారు సాంకేతికంగా అద్భుతంగా ఆడతారన్నాడు. వారి బలహీనలతను పట్టుకోవడం కష్టమన్నాడు. బాబర్ ఆజం, కేన్ విలియమ్సన్, జో రూట్ ఈ కోవకు చెందుతారని ఆకిబ్ వివరించాడు. ఆఫ్ స్టంప్ బంతులను ఆడి కోహ్లీ చాలాసార్లు అవుటయ్యాడని, జేమ్స్ అండర్సన్ అతడిని అలా అవుట్ చేశాడని పేర్కొన్నాడు. కోహ్లీ కనుక తన తీరును మార్చుకుంటే మ్యాచ్‌లు చూస్తానని చెప్పుకొచ్చాడు. తన శరీరానికి దూరంగా వెళ్లే బంతులను కోహ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడకూడదన్నాడు. కోహ్లీ కనుక ఈ టెక్నిక్‌ అందిపుచ్చుకుంటే లేదంటే ఫ్లోను మార్చుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని పేర్కొన్నాడు. అతడు కనుక ‘బ్యాక్ టు బ్యాక్’  ఇన్నింగ్స్ ఆడితే మళ్లీ గాడిన పడినట్టేనని ఆకిబ్ వివరించాడు.

 

 అలాగే, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సారూప్యతల గురించి కూడా ఆకిబ్ సరదాగా వివరించాడు. కోహ్లీనే ఉదాహరణగా తీసుకోవాలన్న ఆకిబ్.. అతడు కనుక ఆత్మవిశ్వాసంతో లేకపోతే పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోతుందని, పరిస్థితి ఇలానే ఉంటుందని అన్నాడు. కోహ్లీ కనుక పరుగులు చేయకపోతే అతడిని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారన్న ప్రశ్నలు తెరపైకి వస్తాయన్నాడు. అంతేకాదని, ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాను ఎందుకు ఆడించలేదన్న ప్రశ్నలు కూడా వస్తాయన్నాడు. అయితే, యూఏఈ పిచ్‌లు బ్యాటింగుకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆకిబ్ జావెద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 28న భారత్-పాక్ జట్లు యూఏఈలో తలపడతాయి.

Updated Date - 2022-08-14T02:31:29+05:30 IST