Donald Trump తొలి భార్య ఇవానా మరణానికి కారణం అదే

ABN , First Publish Date - 2022-07-16T17:50:02+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి భార్య

Donald Trump తొలి భార్య ఇవానా మరణానికి కారణం అదే

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి భార్య ఇవానా ట్రంప్ (Ivana Trump) ముఖ్యమైన శరీర భాగానికి పదునైన గాయం అవడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు న్యూయార్క్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ శుక్రవారం ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన నిర్దిష్ట పరిస్థితులను వివరించలేదు. మరోవైపు ఆమె తన నివాసంలో మెట్లపై నుంచి జారిపడిపోవడం వల్ల మరణించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


న్యూయార్క్ పోలీస్ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ఇవానా ట్రంప్ నివాసం నుంచి వచ్చిన ఫోన్ కాల్‌పై పోలీసులు స్పందించారు. ఆమె ఇంటికి వెళ్ళి చూడగా, ఆమె మరణించి ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఏదైనా నేరం జరగడం వల్ల మరణించినట్లు కనిపించడం లేదన్నారు. 


ప్రేరణనిచ్చే జీవితం 

ఇవానా మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఆమె అద్భుతమైన వ్యక్తి, సౌందర్యరాశి అని పేర్కొన్నారు. ఆమె ప్రేరణనిచ్చే జీవితాన్ని జీవించారన్నారు. తనకు, ఇవానాకు జన్మించిన డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ట్రంప్ ఆమెకు గర్వకారణం, ఆనందదాయకం అని చెప్పారు. 


అత్యంత విలాసవంతంగా... 

ఇవానా ట్రంప్ మోడలింగ్ చేసేవారు. పూర్వపు చెకొస్లొవేకియాలో ఆమె బాల్యం గడిచింది. అప్పట్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుగుతున్న దశలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను 1977లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 1978లో డొనాల్డ్ జూనియర్, 1981లో ఇవాంకా, 1984లో ఎరిక్ జన్మించారు. 80వ దశకంలో న్యూయార్క్‌లో హయ్యెస్ట్ ప్రొఫైల్ కపుల్ వీరే. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షించేవారు. భర్త వ్యాపారంలో ఇవానా అనేక కీలక పాత్రలు పోషించారు. నటి మర్లా మేపిల్స్‌తో ట్రంప్ అఫైర్ కారణంగా ఈ దంపతులిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ట్రంప్ 1993లో మేపిల్స్‌ను వివాహం చేసుకున్నారు. 


నాలుగు పెళ్లిళ్లు

ఇవానా ట్రంప్ సొంతంగా వ్యాపారం చేసేవారు. వస్త్రాలు, ఆభరణాలు, సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం చేసేవారు. కొన్ని పుస్తకాలను కూడా ఆమె రాశారు. ఆమె జీవితంలో మొత్తం నలుగురిని పెళ్లి చేసుకున్నారు. ట్రంప్‌తో వివాహం జరగడానికి ముందు ఒకసారి, ఆయనతో విడిపోయిన తర్వాత రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. 


Updated Date - 2022-07-16T17:50:02+05:30 IST