Punjab : బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్

ABN , First Publish Date - 2022-05-19T21:12:32+05:30 IST

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) మాజీ అధ్యక్షుడు సునీల్

Punjab : బీజేపీలో చేరిన మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్

న్యూఢిల్లీ : పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ (Sunil Jakhar) గురువారం బీజేపీ (BJP)లో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు ఆయనకు ఆ పార్టీ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. అనంతరం ఆయన e పార్టీకి రాజీనామా సమర్పించారు. బీజేపీలో చేరిన అనంతరం సునీల్ జక్కర్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)తో కలిసి మీడియాతో మాట్లాడారు. 


కాంగ్రెస్ (Congress) కోటరీ ఇప్పుడు ఓ ముఠాగా మారిందని సునీల్ జక్కర్ ఆరోపించారు. నడ్డాతో కలిసి వేదికపై మాట్లాడుతూ, ‘‘మీరు సునీల్ జక్కర్‌ను పార్టీ పదవి నుంచి తొలగించగలరు, కానీ ఆయన గళాన్ని నొక్కేయలేరు’’ అన్నారు. ప్రజలను కులాలవారీగా కాంగ్రెస్ (Congress) విభజిస్తోందన్నారు. కాంగ్రెస్‌ను ఓ కుటుంబంగా అభివర్ణిస్తూ, ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకోవడం విచారకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తనకు 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు.  తన కుటుంబంలోని మూడు తరాలకు  1972 నుంచి ఆ పార్టీతో అనుబంధం ఉందని చెప్పారు. పార్టీని తాను ఓ కుటుంబంగా భావించానని తెలిపారు. తాను పార్టీని వీడటానికి కారణం వ్యక్తిగత వివాదాలు కాదని, పార్టీతో ఉన్న మౌలిక సమస్యలే కారణమని చెప్పారు. కాంగ్రెస్‌లో కులతత్వం ఉందని, బీజేపీ అందరినీ సమానంగా చూస్తుందని అన్నారు. 


బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సునీల్ జక్కర్ ఆ పార్టీలో చేరారు. నడ్డా మాట్లాడుతూ, జక్కర్ పంజాబ్‌లో బీజేపీ కోసం ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పారు. పంజాబ్‌ను బలోపేతం చేయడం కోసం జాతీయవాద శక్తులన్నీ కలిసి రావడం చాలా ముఖ్యమని చెప్పారు. 


ఇదిలావుండగా, సునీల్ జక్కర్‌ను రాజ్యసభ సభ్యునిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌ (Punjab) కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలను బీజేపీ వైపు ఆకర్షించేందుకు ఆయన ద్వారా ప్రయత్నించబోతోందని సమాచారం. ఆయనకు ఇతర పార్టీల్లో కూడా అభిమానులు ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ అసమ్మతి నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ (Captain Amarinder Singh) పార్టీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి సానుకూల అంశంగా కనిపిస్తోంది.  రానున్న హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) శాసన సభ ఎన్నికలకు కెప్టెన్ బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. 


Updated Date - 2022-05-19T21:12:32+05:30 IST