Chit Fund Scam : మాజీ ఎంపీ కేడీ సింగ్‌పై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2022-07-27T22:38:20+05:30 IST

రాజ్యసభ (Rajya Sabha) మాజీ సభ్యుడు కేడీ సింగ్‌ (K D Singh)పై కేంద్ర

Chit Fund Scam : మాజీ ఎంపీ కేడీ సింగ్‌పై సీబీఐ కేసు

న్యూఢిల్లీ : రాజ్యసభ (Rajya Sabha) మాజీ సభ్యుడు కేడీ సింగ్‌ (K D Singh)పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. తన కంపెనీల్లో పెట్టుబడి పెడితే మదుపు చేసిన మొత్తానికి 10 రెట్లు పొందవచ్చునని చెప్పి మోసం చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో ఆయన కుమారునితోపాటు ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది. 


సీబీఐ అధికారులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, టీఎంసీ మాజీ నేత, మాజీ ఎంపీ కరణ్ దీప్ సింగ్‌కు ఆల్కెమిస్ట్ ఇన్‌ఫ్రా రియాలిటీ లిమిటెడ్, ఆల్కెమిస్ట్ టౌన్‌షిప్ లిమిటెడ్ అనే కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో అనేకమంది చేత కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టించారు. పెట్టుబడికి 10 రెట్ల మొత్తాన్ని పొందవచ్చునని ఆశ చూపించి, చివరికి మోసం చేశారు. అంతకుముందు ఆయనకు, ఆయన సన్నిహితులకు సంబంధించిన 12 చోట్ల సీబీఐ సోదాలు జరిపింది. 


సింగ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విజయ్ కుమార్ చౌహాన్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశారు. సింగ్ కంపెనీల్లో పెట్టుబడి పెడితే, ఆరేళ్ళకు రెట్టింపు, తొమ్మిదేళ్లకు మూడు రెట్లు, పదహారేళ్ళకు 10 రెట్లు పొందవచ్చునని ఆకర్షణీయంగా చెప్పారన్నారు. ఈ ప్రకటనలను విశ్వసించి, తాను పెట్టుబడులు పెట్టానని, ఆయన తనను మోసం చేశారని ఆరోపించారు. మదుపరులకు వారి సొమ్మును వారికి తిరిగి ఇవ్వలేదని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2021 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.  ఈ ఏడాది జూన్ 28న ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. 


Updated Date - 2022-07-27T22:38:20+05:30 IST