రైతు చింత...!

ABN , First Publish Date - 2021-12-06T04:35:15+05:30 IST

దాదాపు నెలరోజులుగా కురిసిన వర్షాలతో కొండపి ప్రాంత రైతులు కుదేలయ్యారు. ప్రధానంగా నల్లరేగడి నేలలు కలిగిన గ్రామాల రైతులకు వర్షాలు మరీ ఇబ్బందికరంగా మారాయి.

రైతు చింత...!
చిర్రికూరపాడు వద్ద చెరువును తలపిస్తూ పొలాల్లో నిలిచిన నీరు, చింతలపాలెం వద్ద దెబ్బతిన్న పొగమొక్కలు

ఇటీవలి ముసురు వర్షంతో తంటా 

నేటికీ ఆరని పొలాలు 

శనగ కోసం సిద్ధం చేసిన పొలాల్లో నిలిచిన నీరు, మొలిచిన గడ్డి 

పొగ మొక్కలు ఉరకలెత్తకుండా మొక్కల మొదుళ్ల వద్ద సత్తువ మందులు వేస్తున్న కర్షకులు

ఉరకలెత్తిన మినప, పెరిగిన తెగుళ్లు 

చింతలపాలెంలో 400 ఎకరాల్లో రెండో విడత పొగాకు నాట్లు 


కొండపి, డిసెంబరు 5 : దాదాపు నెలరోజులుగా కురిసిన వర్షాలతో కొండపి ప్రాంత రైతులు కుదేలయ్యారు. ప్రధానంగా నల్లరేగడి నేలలు కలిగిన గ్రామాల రైతులకు వర్షాలు మరీ ఇబ్బందికరంగా మారాయి. సకాలంలో వర్షాలు పడతాయని భావించి పొలాలను పొగాకు, శనగ పంటల సాగుకు అనువుగా తయారు చేశారు. దుక్కులు దున్ని సత్తువ మందులు చల్లి, ఒక సాలు గొర్రు కూడా తోలి పెట్టుకున్నారు. ఆ తర్వాత తొలుత పక్షం రోజులు కురిసిన వర్షాలకు ఆ పొలాల్లో గడ్డి విపరీతంగా పెరిగింది. మళ్లీ సాగుకు గడ్డి అడ్డంగా ఉండడంతో రైతులు దాని నివారణకు మందు కొట్టారు. మళ్లీ సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో మళ్లీ వర్షాలు పడి గడ్డి పెరిగింది. చాలా మంది రైతులో ఎలాగొలా పొలాలను బాగు చేసి పొగాకు, శనగ పంటలను సాగు చేశారు. ఇటీవల వర్షాలకు కొండపి, జరుగుమల్లి మండలాల్లో ప్రధానంగా సాగైన పొగాకు, శనగ పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పొగాకు పంటకు భారీ నష్టం వాటిల్లింది. 

కొండపి మండలంలోని ఇలవర, గోగినేనివారిపాలెం, కట్టుబడివారిపాలెం, మిట్టపాలెం, కె. ఉప్పలపాడు, చినవెంకన్నపాలెం గ్రామాలతోపాటు జరుగుమల్లి మండలంలోని చింతలపాలెం, చిర్రికూరపాడు, దావగూడూరు, కామేపల్లి, తదితర పరిసర గ్రామాల్లో పొగాకు దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా రైతులు వేశారు. ఒక్క చింతలపాలెంలో రైతులు తొలిసారి నాలుగు వందల ఎకరాలు పొగాకు మొక్కలు వేశారు. వరుస తుఫాన్లు, వాతావరణ ప్రభావంతో దాదాపు పక్షం రోజులపాటు కురిసిన వర్షాలకు మొక్కలు చనిపోవడంతో, తిరిగి గ్రామంలోని రైతులు అందరూ పొగ మొక్కలు రెండో విడత వేస్తున్నారు. పొగ మొక్కలు వేసేందుకు ఎకరాకు ఖర్చు చేసిన 5 వేల రూపాయల వంతున రైతులు భారీ మొత్తంలో నష్టపోయారు. అదేవిధంగా పలు గ్రామాల్లో పొగాకు మొక్కలు ఎండలకు తలలు నేలవాలుస్తుండటంతో అవి తిరిగి నిలదొక్కుకునేందుకు మొక్కల మొదలు, వేర్లకు దగ్గరగా సత్తువ మందులైన సూపర్‌పాస్ఫేట్‌, యూరియా వేస్తున్నారు. 


శనగ వేయాల్సిన పొలాల్లో గడ్డి, నీళ్లు 

కొండపి, జరుగుమల్లి మండలాల పరిధిలోని రింగ్‌రోడ్డులోని దాదాపు 40కి పైగా గ్రామాల్లో శనగ పంట రైతులు నవంబరు, డిసెంబరు నెలల్లో వేస్తారు. ప్రధానంగా నల్లరేగడి నేలలు ఉన్న ఈ గ్రామాల్లో దాదాపు 20 వేలకు పైగా ఎకరాల్లో శనగ వేస్తారు. ఇప్పటికీ ఈ పొలాల్లో నీరు, గడ్డి విపరీతంగా మొలిచింది. మరో పక్షం రోజులకు పైగా పొలాలు ఆరేందుకు సమయం పడుతుందని రైతులు అంటున్నారు. ఇప్పటికే ఒక పర్యాయం డ్రోన్ల సాయంతో గడ్డి నివారణకు మందు పిచికారీ చేయించామని, తిరిగి వర్షాలకు గడ్డి మొలిచిందని చిర్రికూరపాడు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. శనగకు కూడా అదును దాటిపోతున్నదని వాపోయారు. 


జీవాల కాళ్లకు పుండ్లు

నెల రోజులపాటు కురిసిన వర్షాలకు మేకలు, గొర్రెలు జీవాల కాళ్లకు పుండ్లు, పాచి పట్టి గిట్టలు ఎగరేసి జీవాలు నడుస్తున్నాయని జీవాల యజమానులు తెలిపారు. రెండు మండలాల్లో 30 వేలకు పైగా జీవాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇళ్ల వద్ద, దొడ్లలో కొన్ని జీవాలు పుండ్లుతో బాధపడుతున్నాయని కాపరులు తెలిపారు. నివారణ చర్యలు తీసుకున్న అధికారులు లేరని వారు వాపోతున్నారు. 


ఉరకెత్తిన పచ్చశనగ పైరు

మర్రిపూడి, డిసెంబరు 5 : ఇటీవల ఎడతెరపి లేని వర్షాల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేసిన పచ్చిశెనగ పైరుకు తీవ్ర నష్టం వాటిలింది. కాకర్ల, చిమట, పన్నూరు గ్రామాల్లో 380 హెక్టార్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ మేరకు జిల్లా అధికారులకు సమాచారం పంపించామని వ్యవసాయ అధికారి సీహెచ్‌ వెంకటేష్‌ చెప్పారు. ఉరకెత్తిన పొలాల్లో తిరిగి పంట సాగు చేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తామన్నారు.

Updated Date - 2021-12-06T04:35:15+05:30 IST