Sri Lanka: దేశం విడిచి పారిపోకుండా మహింద రాజపక్సపై Travel Ban

ABN , First Publish Date - 2022-05-12T23:11:21+05:30 IST

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స(Mahinda Rajapaksa), ఆయన కుమారుడు నమల్ రాజపక్స,

Sri Lanka: దేశం విడిచి పారిపోకుండా మహింద రాజపక్సపై Travel Ban

కొలంబో: శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స(Mahinda Rajapaksa), ఆయన కుమారుడు నమల్ రాజపక్స, మరో 15 మందిపై శ్రీలంక కోర్టు ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించింది. కొలంబోలో ఈ వారం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై జరిగిన హింసాత్మక దాడిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. సోమవారం గోటాగోగామా, మైనాగోగామాలలో జరిగిన శాంతియుత నిరసనలపై జరిగిన దాడిపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వీరు దేశం దాటి పోకుండా ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు వారిపై విదేశీ ప్రయాణ నిషేధాన్ని విధించింది. 


మహింద రాజపక్స, ఆయన కుమారుడితోపాటు పార్లమెంటు సభ్యులు జాన్‌స్టన్ ఫెర్నాండో, పవిత్ర వన్నియారచ్చి, సంజీవ ఎడిరిమన్నే, కాంచన జయరత్నె, రోహిత అబేయుగుణవర్ధనె, సీబీ రత్నాయకే, సంపత్ అతుకోరల, రేణుక పెరేరా, శాంతి నిషాంత, సీనియర్ డీఐజీ దేశబంధు తెన్నాకూన్ తదితరులు నిషేధం ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. 


రెండు హింసాత్మక ఘటనల వెనక కుట్ర ఉందని, ముందస్తుగా దీనికి పథక రచన జరిగిందని పేర్కొన్న అటార్నీ జనరల్.. వారిని విచారించాల్సిన అవసరం ఉందని, కాబట్టి దేశం విడిచి పోకుండా 17 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కోర్టును కోరారు. పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వారు దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించింది. కాగా, యునైటెడ్ నేషనల్ పార్టీ (UNP) నేత రణిల్ విక్రమసింఘే మరికాసేపట్లో శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.  


Read more