CyrusMistry: సీట్ బెల్ట్‌ను లైట్ తీసుకుంటున్నారా.. పాపం.. ఈయన అలా పెట్టుకోకపోవడం వల్లే..

ABN , First Publish Date - 2022-09-05T19:04:42+05:30 IST

టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) మరిక లేరు. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ఆదివారం మధాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో..

CyrusMistry: సీట్ బెల్ట్‌ను లైట్ తీసుకుంటున్నారా.. పాపం.. ఈయన అలా పెట్టుకోకపోవడం వల్లే..

ముంబై: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) ఇక లేరు. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ఆదివారం మధాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. అహ్మదాబాద్‌ నుంచి మెర్సిడెజ్‌ బెంజ్‌ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్‌ జిల్లాలోని సూర్య నదిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేయగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ అసలు సీటు బెల్టే పెట్టుకోలేదని విచారణలో తెలిసింది. ఆయనతో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ఉండేవని దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. సీటు బెల్ట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసు వర్గాలు చెప్పాయి. రాంగ్‌ రూట్‌లో మరో వాహనాన్ని ఎడమ పక్క నుంచి ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. సైరస్ మిస్త్రీ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయారన్న సంగతి తెలిసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. కారు వెనుక సీట్లో కూర్చున్నా ఎల్లప్పుడూ తాను సీట్ బెల్ట్ ధరిస్తానన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నానని, అందరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో కారు వెనక భాగంలో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ పండోల్‌ అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న ప్రముఖ గైనకాలజిస్ట్‌ అనహిత పండోల్‌ (55), ఆమె భర్త డారియస్‌ పండోల్‌ (60) మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయపడ్డారు. వారిరువురు గుజరాత్‌లోని వాపి వద్ద ఉన్న ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన జహంగీర్‌ పండోల్‌.. డారియస్‌ పండోల్‌ సోదరుడు. ఆయన గతంలో టాటా గ్రూప్‌ కంపెనీల్లో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మిస్త్రీ దుర్మరణం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-05T19:04:42+05:30 IST