Donald Trump : మోదీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-09T00:59:12+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా

Donald Trump : మోదీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య సత్సంబంధాలు మరోసారి వెల్లడయ్యాయి. మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. అదేవిధంగా భారత దేశానికి తాను గొప్ప స్నేహితుడినని చెప్పారు. 2024లో అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి కూడా మాట్లాడారు. 


ఓ భారతీయ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని తనను అందరూ కోరుతున్నారని, అభిప్రాయ సేకరణ సర్వేలలో కూడా తాను ముందంజలో ఉన్నానని తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 


జో బైడెన్, బరాక్ ఒబామా వంటి అమెరికా అధ్యక్షుల కన్నా మీకు భారత దేశంతో మెరుగైన సంబంధాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అని అడిగినపుడు ట్రంప్ స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈ ప్రశ్న అడగాలన్నారు. తాను దేశాధ్యక్షుడిగా ఉన్నప్పటి కన్నా మెరుగైన సంబంధాలు ఇంకెప్పుడైనా ఉన్నాయని తాను అనుకోవడం లేదన్నారు. భారతీయుల నుంచి తనకు గొప్ప మద్దతు లభించిందని చెప్పారు. మోదీతో సత్సంబంధాల గురించి ప్రస్తావించారు. అమెరికా, భారత దేశాల్లో జరిగిన భారీ సభల్లో ఇరువురు నేతలు వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. 


భారత్, మోదీలతో తనకు గొప్ప సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తామిద్దరమూ స్నేహితులమని తెలిపారు. మోదీ చాలా గొప్ప నేత అని, అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. మోదీ చేస్తున్నది అంత సులువైన పని ఏమీ కాదన్నారు. తమకు చాలా కాలం నుంచి స్నేహం ఉందని, మోదీ మంచివారని అన్నారు. 


అమెరికా అధ్యక్ష పదవిని మళ్ళీ చేపడితే అమెరికా, భారత్‌ల విషయంలో ప్రాధాన్యతలేమిటని ప్రశ్నించినపుడు ట్రంప్ మాట్లాడుతూ, భారత దేశంలో తన మిత్రుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. అమెరికాకు ఇంధన స్వాతంత్ర్యాన్ని, గొప్ప ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తానని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీరుపై పెదవి విరిచారు. రికార్డు స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పిస్తానని చెప్పారు. తాను అధ్యక్షునిగా ఉన్న కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. 


ట్రంప్, మోదీ సభలు

అమెరికాలోని హూస్టన్‌లో 2019 సెప్టెంబరులో జరిగిన ‘హౌడీ, మోడీ’ సభలో ట్రంప్, మోదీ పాల్గొన్నారు. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని మోదీ చెప్పడం విమర్శలకు గురైంది. 2020 ఫిబ్రవరిలో గుజరాత్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఈ ఇరువురు నేతలు మాట్లాడారు. 


Updated Date - 2022-09-09T00:59:12+05:30 IST