డ్రగ్స్ తీసుకున్నా.. భారత వ్యాపారవేత్త నుంచి లంచం కూడా తీసుకున్నా: జింబాబ్వే మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-24T22:11:41+05:30 IST

జింబాబ్వే క్రికెట్ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు తాను భారతీయ

డ్రగ్స్ తీసుకున్నా.. భారత వ్యాపారవేత్త నుంచి లంచం కూడా తీసుకున్నా: జింబాబ్వే మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: జింబాబ్వే క్రికెట్ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు తాను భారతీయ వ్యాపారవేత్త నుంచి 15 వేల డాలర్లు తీసుకోవడమే కాకుండా కొకైన్ కూడా తీసుకున్నానని వెల్లడించాడు. ఫలితంగా కొన్ని సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధానికి గురవుతానేమోనని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫిక్స్ చేశానని ఐసీసీ తనపై విచారణ జరిపి కొన్నేళ్లపాటు నిషేధం విధిస్తుందేమోనని పేర్కొన్నాడు. అయితే, తాను కొన్ని తప్పులు చేసి ఉంటానేమో కానీ, ఫిక్సింగ్ మాత్రం చేయలేదనని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.  


జింబాబ్వేలో టీ20 పోటీల నిర్వహణకు సంబంధించి చర్చించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఒకరు తనను అక్టోబరు 2019లో ఆహ్వానించారని, చర్చల సందర్భంగా తనకు 15 వేల డాలర్లు ఇస్తామన్నారని పేర్కొన్నాడు. అప్పటికే తమకు ఆరు నెలలుగా వేతనాలు లేవని, జింబాబ్వే జట్టు ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదన్న ఆందోళనలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. అలాంటి సమయంలో ఈ ఆహ్వానం తనకు వచ్చిందన్నాడు.  


అంతకుముందు రోజు రాత్రి డ్రింక్స్ సందర్భంగా తనకు, తన సహచరులకు ఆ వ్యాపారవేత్త కొకైన్ కూడా ఇచ్చాడని, తాము తెలివి తక్కువగా వాటిని తీసుకున్నామని టేలర్ అన్నాడు. ఆ తర్వాతి రోజు ఉదయం ఆ వ్యాపారవేత్త నేరుగా తన హోటల్ రూముకు వచ్చాడని పేర్కొన్నాడు.


అంతకుముందు రోజు రాత్రి తాను కొకైన్ తీసుకుంటున్నప్పటి వీడియో చూపించాడని, తమ కోసం అంతర్జాతీయ మ్యాచ్‌లు ఫిక్స్ చేయకుంటే ఆ వీడియోను బహిరంగ పరుస్తానని హెచ్చరించాడని గుర్తు చేసుకున్నాడు. అతడు తనను కార్నర్ చేశాడని, మ్యాచ్‌లు ఫిక్స్ చేసేందుకు 15 వేల డాలర్లు ఇచ్చాడని పేర్కొన్నాడు. అక్కడి నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశంతో ఆ డబ్బులు తీసుకున్నానని చెప్పాడు.


ఈ నేరాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు తనకు నాలుగు నెలల సమయం పట్టిందన్నాడు. ఐసీసీ తీసుకునే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడకుండా ఉండేందుకు తోటి క్రికెటర్లకు తన స్టోరీ ఓ ప్రేరణ కావాలని అనుకున్నానని వివరించాడు. అయితే, తాను మ్యాచ్‌లు మాత్రం ఫిక్స్ చేయలేదని నొక్కి చెప్పాడు. 


17 ఏళ్లుగా జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రెండన్ టేలర్ గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. జింబాబ్వే తరపున 205 వన్డే మ్యాచ్‌లు ఆడిన టేలర్ ఆ దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అతడి ఖాతాలో 11 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లోనూ తనదైన ముద్ర వేసిన టేలర్ 34 మ్యాచుల్లో ఆరు సెంచరీలు సాధించాడు.  

Updated Date - 2022-01-24T22:11:41+05:30 IST