మౌన గురువు

ABN , First Publish Date - 2022-04-29T04:38:47+05:30 IST

పూర్వం ఒక మోసగాడు ఉండేవాడు. అతను జ్ఞాని కాడు. కానీ జెన్‌ గురువులా వేషం వేశాడు. తనను ‘మౌన గురువు’గా ప్రకటించుకున్నాడు..

మౌన గురువు

పూర్వం ఒక మోసగాడు ఉండేవాడు. అతను జ్ఞాని కాడు. కానీ జెన్‌ గురువులా వేషం వేశాడు. తనను ‘మౌన గురువు’గా ప్రకటించుకున్నాడు. తన దగ్గరకు ఎవరు వచ్చినా, ఏది అడిగినా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఏవో కొన్ని సైగలు చేసేవాడు. అతనితో పాటు పండితులైన ఇద్దరు సన్యాసులు అన్ని సమయాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అన్ని శాస్త్రాలనూ చదివిన వాళ్ళు. మంచి వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు. తమ మాటలతో జనాన్ని నమ్మించడంలో నిపుణులు. ఆ మౌన గురువు ఏ సైగ చేసినా, ఏ కేక వేసినా అందులో ఎంతో అంతరార్థం, పరమార్థం ఉన్నాయని చెప్పేవారు. అజ్ఞాని అయిన ఆ మోసగాడు... ఎంతో గొప్పవాడనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించారు.


ఆ గురువు ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. అతణ్ణి దర్శించి తరించాలనీ, తమ సందేహాలు తీర్చుకోవాలనీ, ఆశీస్సులు పొందాలనీ దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఎందరెందరో వచ్చేవారు. ఎవరు ఏది అడిగినా ఆ మౌన గురువు చేతులు ఊపడమో, కాళ్ళు కదిలించడమో, కళ్ళు మూసుకోవడమో, ఎగరడమో, దుమకడమో, కేకలు వేయడమో చేసేవాడు. అతనికి అంతకన్నా మరేదీ తెలీదు. కానీ అతని దగ్గర ఉన్న పండిత సన్యాసులు తమ తెలివినంతటినీ ఉపయోగించి... ఆ చేష్టల్లో ఏదో పరమార్థం ఉందన్నట్టు... గొప్పగా వివరించేవారు. వచ్చిన వ్యక్తులు అది చూసి ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ పొందేవారు. వారిలో ఆ గురువు పట్ల గౌరవం విపరీతంగా పెరిగిపోయేది. అతనికి ధన, కనక, వస్తు, వాహనాలు సమర్పించేవారు. తమ జన్మధన్యమైందనుకొని సంతోషంగా తిరిగి వెళ్ళేవారు.


ఒకసారి ఆ ఇద్దరు సన్యాసులకూ ఏదో పని పడింది. త్వరలోనే తిరిగి వస్తామంటూ... మౌన గురువును ఒంటరిగా వదలి వెళ్ళారు. మరికొంతసేపటికి... ఆ గురువు గొప్పతనం గురించి విన్న ఒక జిజ్ఞాసువు... తన సందేహాలను తీర్చుకోవడానికి అతణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. మౌన గురువుకు నమస్కరించి... ‘‘మహాశయా! బుద్ధత్వం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.


తన పండిత సన్యాసుల కోసం మౌన గురువు అటూ ఇటూ చూశాడు. వారు కనబడకపోవడంతో... వారు ఎక్కడికో వెళ్ళిన సంగతి గుర్తుకువచ్చి.. ‘లేరు, లేరు’ అని మనసులో అనుకుంటూ... తన రెండు చేతులనూ అటూ ఇటూ తిప్పాడు. 


ఆ వచ్చిన వ్యక్తి మరి కొన్ని ప్రశ్నలు వేశాడు. మౌన గురువు తనకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో చేశాడు. ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా, సంతృప్తిగా, వికసించిన ముఖంతో వెనుతిరిగాడు. ఈలోగా పండిత సన్యాసులు గాభరా పడుతూ అతనికి ఎదురువచ్చారు. 


ఆ వ్యక్తి వాళ్ళతో ‘‘ఈ మౌన గురువు ఎంత గొప్పవాడండీ! వాళ్ళూ, వీళ్ళూ చెబితే నేను నమ్మలేదు. కానీ ఈ రోజు ఆయనను ప్రత్యక్షంగా చూసి, ప్రశ్నించి, పరీక్షించి, వారి గొప్పతనాన్ని తెలుసుకోగలిగాను’’ అన్నాడు.


ఆ సన్యాసులు ఆశ్చర్యపోయారు. ‘‘మీరు ఆయన్ని ఏం అడిగారు? దానికి ఆయన ఏమని సమాధానం ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు.


‘‘నేను ‘బుద్ధత్వం’ అంటే ఏమిటి? అని అడిగాను. ఆయన అన్ని దిక్కులనూ చూసి, చేతులు ఇలా ఊపాడు. అలా చేయడం ద్వారా... బుద్ధత్వం కానీ, బుద్ధుడు కానీ బయట ఎక్కడా కనిపించేవి కావని బోధించాడు. ఆ తరువాత ‘ధర్మం అంటే ఏమిటి?’ అని అడిగాను. ఆయన ఆకాశం వైపూ, నేల వైపూ చూపించాడు. అలా ‘భూమ్యాకాశాలకు ఆధారమైనది ధర్మం’ అని తెలిపాడు. ‘ధ్యానం అంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు... కళ్ళు మూసుకొని, కొయ్యబొమ్మలా కూర్చొని... ధ్యానం అంటే ఏమిటో చక్కగా అవగతం అయ్యేలా చేశాడు. గురువు అంటే అలా ఉండాలి. గురువంటే ఆయనే... ఆయనే జ్ఞాని, ఆయనే బుద్ధుడు’’ అంటూ మౌన గురువు వైపు చూసి, చేతులు జోడించి, నమస్కరించి వెళ్ళిపోయాడు.


పండిత సన్యాసులు పరుగుపరుగున మౌన గురువు దగ్గరకు వెళ్ళారు. అతను వాళ్ళను చూసి ‘‘ఇంతసేపూ ఎక్కడికి పోయారు? వాడు వేసిన ప్రశ్నలకు దిక్కు తోచక చచ్చాను’’ అన్నాడు.


ఈ పండిత సన్యాసుల లాంటి వాళ్ళు సత్యాన్ని మరుగు పరచి మోసగిస్తారు. ఆ మాటలు నమ్మి... మౌన గురువు లాంటివారిలో లేని గొప్పతనం ఉందని భ్రమపడి... అమాయకులు సులభంగా మోసపోతారు. 





- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-04-29T04:38:47+05:30 IST