అప్పుల ఉరికి ఇద్దరు రైతులు బలి

ABN , First Publish Date - 2021-01-16T06:24:24+05:30 IST

అప్పుల బాధతో జిల్లాలో పండుగ పూట గురువారం నాడు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అమరాపురం మండలం గౌడనకుంట గ్రామానికి చెందిన రైతు ఉగ్రప్ప(65) అప్పుల బాధ తాళ లేక గ్రామ సమీపంలోని పశువుల కొట్టంలో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల ఉరికి ఇద్దరు రైతులు బలి
ఉగ్రప్ప(ఫైల్‌ఫొటో)

అమరాపురం/పెద్దవడుగూరు, జనవరి 15: అప్పుల బాధతో జిల్లాలో పండుగ పూట గురువారం నాడు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అమరాపురం మండలం గౌడనకుంట గ్రామానికి చెందిన రైతు ఉగ్రప్ప(65) అప్పుల బాధ తాళ లేక గ్రామ సమీపంలోని పశువుల కొట్టంలో గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రామక్క తెలిపిన మేరకు... ఉగ్రప్పకు ఉన్న 4.80 ఎకరాల భూమిలో మూడు బోరు బావులు తవ్వించగా ఒకదానిలో మాత్రమే నీరు లభించాయి. వస్తున్న నీటితోనే వక్క, త మలపాకు తోటను కాపాడుకునే వారు. బోరుబావులు తవ్వించడానికి దాదాపు రూ.6.40 లక్షలు అప్పులు చేశాడు. ఇందులో బ్యాంకు రుణాలు రూ.1.40లక్షలు మిగిలిన రూ.5లక్షలు గ్రామంలో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు చేసినట్లు తెలిపారు. అప్పులు ఎలా తీర్చాలని ఎప్పుడూ మథన పడుతుండేవాడని, వీటిని తీర్చేమార్గం కానరాక ఆత్మహత్య చేసుకొన్నట్లు ఆమె తెలిపింది. మృతుడికి భా ర్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారికి వివాహాలు కూడా చేశాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు. శవాన్ని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


ముప్పాలగుత్తిలో మరో రైతు...

పెద్దవడుగూరు మండలంలోని ము ప్పాలగుత్తి గ్రామంలో గురువారం సాయంత్రం రైతు బాల దస్తగిరి (38) అప్పుల బాధతాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు బాలదస్తగిరి తన కున్న మూడెకరాల భూమిలో పత్తిపంట సాగుచేశాడు. మూడు సంవత్సరాలుగా పెట్టిన పెట్టుబడులు కూడా రాక పోవడం, ఈ ఏడాది కూడా అధికవర్షాల వల్ల సాగు చేసి న పత్తిపంటలో నష్టాలు రావడంతో దాదాపు రూ.4లక్షల మేర అప్పులు పెరిగాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మథనపడేవాడన్నారు. గురువారం ఇంటిలో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగాడు. అపస్మార కస్థితిలో పడిఉన్న అతడిని బంధువులు గమనించి  గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. 



Updated Date - 2021-01-16T06:24:24+05:30 IST