ఫౌండేషన్‌ స్కూల్‌... విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకం’

Jun 16 2021 @ 23:16PM
నరసన్నపేటలో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు

నందిగాం, జూన్‌ 16: ఫౌండేషన్‌ స్కూల్‌ పేరుతో ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలవలస ధర్మారావు, జిల్లా కార్యదర్శి కురమాన దాలయ్య అన్నారు. బుధవారం పెద్దతామరాపల్లిలో  సర్పంచ్‌ను కలిసి ప్రాథమిక పాఠశాల ఉండేలా ప్రభుత్వానికి విన్నవించాలని వినతిపత్రం అందించారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు బాలక శంకరరావు, సురేష్‌ కుమార్‌ ఉన్నారు.


సర్క్యులర్‌ను రద్దు చేయాలి

రాజాం: ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు రెడ్డి మోహనరావు కోరారు. బుధవారం  బుచ్చింపేట, అమరాం గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు నూతన విద్యా విధానం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ప్రధాన  కార్యదర్శి డి.వెంకటరావు,  బి.రామి నాయుడు,  కురిటి బాలమురళీ తదితతరులు పాల్గొన్నారు. 


నూతన విద్యా విధానంతో నష్టం

టెక్కలి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఎన్‌ఈపి-2020 విధానం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుందని యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు పి.ధర్మారావు, జిల్లా కార్యదర్శి కె.దాలయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం వారు మాట్లాడుతూ 1,2 తరగతులను అంగన్వాడీల్లోనూ, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపడం ద్వారా విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. 


పాఠశాలల ఎత్తివేత ప్రయత్నాలు విరమించే వరకు పోరాటం

నరసన్నపేట: సంస్కరణల పేరుతో ప్రభుత్వం పాఠశాలలను ఎత్తి వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను  విరమించేవరకు పోరాటం చేయాలని యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు వేర్వేరుగా కోరారు. బుధవారం ఎంఆర్‌సీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మూడోతరగతి నుంచి ఐదోతరగతి విద్యార్ధులను హైస్కూల్‌లో విలీనం చేయడం వల్ల నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు. అనంతరం ఎంఈవో ఉప్పాడ శాంతారావుకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆ యా సంఘాల నాయకులు బి.శ్రీరామమూర్తి, బి.కేశవరావు, ఎం.లక్ష్మీ నారాయణ, ఆజాద్‌, దమయంతి  పాల్గొన్నారు. 


బడిని కాపాడుకుందాం

వజ్రపుకొత్తూరు: పెదబడాంలో యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు బి.చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం మనవూరు బడిని కాపాడుకుందాం అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.కిశోర్‌ కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల పేరుతో ప్రాఽథమిక విద్యను గ్రామీణ విద్యార్థులకు దూరం చేయాలని ప్రయత్నాలను వ్యతిరేకించాలని కోరారు. అనంతరం సర్పంచ్‌ పీత మోహన్‌కు వినతి పత్రం అందజేశారు.

 


 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.