California: అమెరికాలో ఘోరం.. 8 నెలల చిన్నారి సహా నలుగురు భారతీయుల దారుణ హత్య!

ABN , First Publish Date - 2022-10-07T13:04:15+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అపహరణకు గురైన ఓ సిక్కు కుటుంబం దారుణ హత్యకు గురైంది. పంజాబ్‌లోని హోష్యార్‌పూర్‌లోని హర్సీపిండి గ్రామానికి చెందిన జస్దీప్‌ సింగ్‌ (36), అతని భార్య జస్లీన్‌ కౌర్‌ (27) కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మెర్కెడ్‌ కౌంటీలో వారు ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేస్తున్నారు.

California: అమెరికాలో ఘోరం.. 8 నెలల చిన్నారి సహా నలుగురు భారతీయుల దారుణ హత్య!

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తీవ్ర దిగ్ర్భాంతి

కాలిఫోర్నియా/హరియాణా, అక్టోబరు 6: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అపహరణకు గురైన ఓ సిక్కు కుటుంబం దారుణ హత్యకు గురైంది. పంజాబ్‌లోని హోష్యార్‌పూర్‌లోని హర్సీపిండి గ్రామానికి చెందిన జస్దీప్‌ సింగ్‌ (36), అతని భార్య జస్లీన్‌ కౌర్‌ (27) కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మెర్కెడ్‌ కౌంటీలో వారు ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేస్తున్నారు. వీరికి 8 నెలల కూతురు ఆరూహీ ధేరీ ఉంది. జస్దీప్‌ సోదరుడు అమన్‌దీ్‌ప సింగ్‌ (39) కూడా వీరితోనే ఉంటున్నారు. సోమవారం జీసస్‌ మాన్యుయెల్‌ సల్గాడో అనే దోపిడీ దొంగ వీరిని అపహరించాడు. వీరి కారు అక్కడికి కొంత దూరంలో దహనమై ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కిడ్నాప్‌ విషయం వెలుగులోకి వచ్చింది.


దుండగుడు వీరందరి చేతులను కట్టి.. తుపాకీతో బెదిరిస్తూ.. ఓ ట్రక్కులో తీసుకువెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అప్పటి నుంచి మెర్కెడ్‌ కౌంటీ, కాలిఫోర్నియా పోలీసులు ఈ కుటుంబం జాడ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. బాధితుల్లో ఒకరి డెబిట్‌ కార్డును దుండగుడు మంగళవారం ఉదయం మెర్కెడ్‌ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఏటీఎంలో వినియోగించినట్లు గుర్తించారు. ఏటీఎం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని జీసస్‌ మాన్యుయెల్‌ సల్గాడో అని గుర్తించారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకోగా.. కస్టడీలోనే ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతలో మెర్కెడ్‌ కౌంటీలోని ఓ పళ్ల తోటలో నాలుగు మృతదేహాలున్నట్లు గుర్తించిన తోటమాలి.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలు జస్దీప్‌, జస్లీన్‌, ఆరూహీ, అమన్‌దీ్‌పవిగా గుర్తించారు. కాగా.. జస్దీప్‌ కుటుంబం హత్య వార్తతో అతని స్వగ్రామమైన హర్సీపిండీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. జస్దీప్‌ కుటుంబం హత్య పట్ల హోష్యార్‌పూర్‌ ఎంపీ, కేంద్ర మంత్రి సోమ్‌ ప్రకాశ్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-07T13:04:15+05:30 IST