వలస విషాదం

ABN , First Publish Date - 2022-08-18T06:12:11+05:30 IST

లింగపాలెం మండలం భోగోలు ఫారెస్టులో జామాయిల్‌ చెట్లు నరకడానికి కత్తిపూడికి చెందిన శివ అనే కాంట్రాక్టర్‌ కాకినాడ జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు, తొండంగి తదితర మండలాల నుంచి 40 మంది కూలీలను తీసుకువచ్చారు.

వలస విషాదం

నిశి రాత్రిలో పిడుగుపాటు.. నలుగురి మృతి 

నిశి రాత్రిలో విషాదం అలుముకుంది. సూర్యుడికి ముందే నిద్ర లేచి సాయం త్రం వరకు ఒంటిని వింటి వలె వంచి చెమటోడ్చిన జీవితాలు పొలాల మధ్య కడ తేరిపోయాయి. పిడుగు రూపంలో వచ్చిన మృత్యుదేవత రెప్పపాటులో వారిని మాడ్చేసింది. లింగపాలెం మండలం భోగోలు వద్ద మంగళవారం అర్ధరాత్రి పిడుగు పడి నలుగురు వలస కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రెండు జిల్లాల్లో విషాదాన్ని నింపింది.  


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

లింగపాలెం మండలం భోగోలు ఫారెస్టులో జామాయిల్‌ చెట్లు నరకడానికి కత్తిపూడికి చెందిన శివ అనే కాంట్రాక్టర్‌ కాకినాడ జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు, తొండంగి తదితర మండలాల నుంచి 40 మంది కూలీలను తీసుకువచ్చారు. నాలుగైదు రోజులుగా పనులు చేసుకుంటున్నారు. వ్యక్తుల పనిని బట్టి రోజుకు కూలీ రూ.వెయ్యి, రూ.700, 800 చొప్పున అందిస్తున్నాడు. నెల నుంచి ఉప్పాక లో పనిచేసిన 40 మందిని శనివారం భోగోలు వద్ద గల జామాయిల్‌ తోటలో పనులకు తీసుకు వచ్చాడు. అదే రోజున కార్మికులు పరిసర ప్రాం తాల్లో పాకలు వేసుకుని ఆదివారం నుంచి పను లు ప్రారంభించారు. రోజూలాగే మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచిన వలస కార్మికులు కాలకృత్యాలు తీర్చుకుని  పనుల్లోకి దిగారు. పనులన్నీ పూర్తిచేశాక, భోజ నాలు పూర్తి చేసుకుని రాత్రి 9–10 గంటల మధ్యలో నిద్రకు ఉపక్రమించారు. అయితే ప్రమాదం జరిగిన గుడారంలో ఒక వరుసలో తొమ్మిది మంది, మరో వరుసలో ఆరుగురు పక్కపక్కనే పడుకున్నారు. ఆరుగురు పడుకు న్నచోట అందుబాటులోని 5–6 అడుగుల జా మాయిల్‌ కర్రలను కింద వేసుకుని నిద్రించారు. విష కీటకాల నుంచి రక్షణ కోసమని, వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని అలా ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన తొమ్మిది మం ది నేలను చదును చేసుకుని టార్పాలిన్‌ వేసుకు ని పడుకున్నారు. పడుకున్న కాసేపటికే వర్షం జోరందుకుంది. భారీ ఉరుములు, మెరుపులతో శబ్దాలు మొదలయ్యాయి. భయంకరమైన పిడుగు గుడారంపై చొచ్చుకువచ్చింది. నిద్రి స్తోన్న తొమ్మిది మందిపై పడటంతో అందులో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామానికి చెందిన కూనపురెడ్డి శ్రీనివాస్‌ (20), వరుపుల ధర్మరాజు(23), ప్రత్తిపాడు మండలం పోతులూరుకి చెందిన రాయుడు రాజు(28), తొండంగి మండలం దానవాయిపేటకి చెందిన గుత్తుల కొండబాబు(32) అక్కడికక్కడే మృతి చెందారు. కె.గణేష్‌, బుల్లయ్య, అర్జున్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయానికి కొందరు మేల్కొనే ఉన్నా ఆ వర్షంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. ప్రమాదం జరిగిన గుడారంలో చివరి వరుసలో పడుకున్న వ్యక్తి గాబరా గాబరాగా లేచి పరుగులు పెట్టాడు. ‘బాబోయ్‌ నా కాలు పనిచేయట్లేదు. పనిచేయట్లేదు’ అంటూ బిగ్గరగా అరుస్తూ పరుగులు పెడుతోన్న వ్యక్తిని చూసి అందరూ ఆ గుడారం వద్దకు పరుగులు పెట్టారు. 

ప్రాణ భయంతో పరుగులు 

పిడుగు పడ్డ గుడారంలోకి వెళ్లి చూసేసరికి నల్లగా మాడిపోయినట్లు ఆ నలుగురి మృతదేహా లు కనిపించాయి. గాయాలపాలైన వారిని ట్రాక్టర్ల ద్వారా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసు కెళ్లారు. 108కు ఇచ్చిన సమాచారంతో వాహనా లు వచ్చి మృతదేహాలను ఏలూరుకు తరలించా రు. అయితే కొద్ది గంటల ముందు దాకా తమతో కలిసి పనిచేసిన వ్యక్తులు కళ్ల ముందే శవాలుగా పడి ఉండటాన్ని చూసిన ఇతర కార్మికులు చలిం చిపోయారు. ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉందో తెలీక బెంబేలెత్తిపోతున్నారు. పనులు వదిలేసి విషణ్ణ వదనాలతో తిరుగు పయనమ య్యారు. విజయవాడలో చికిత్స పొందుతున్న ముగ్గురి వద్దే ఉన్న మేస్ర్తీ శివ మిగిలిన కార్మి కులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ వినే పరిస్థితిలో లేమని కార్మికులు అంటున్నారు. తామంతా ఆరేడేళ్లుగా ఒకే మేస్ర్తీ వద్ద పనిచేస్తున్నామని, చనిపోయిన నలుగురు చాలా ఏళ్లుగా తమతో కలిసి పనిచేశారని తోటి కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. చనిపోయిన కొండబాబుకు ఇద్దరు కుమారులు కాగా భార్య గర్భంతో ఉండగా, రాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేణు, ధర్మరాజుకు వివాహం కాలేదు. వారి తల్లిదండ్రుల పరిస్థితిని తలచుకుంటూ ఆ కార్మికులు కంటి గడప నుంచి తన్నుకొస్తోన్న కన్నీటిని నియంత్రించుకుంటున్నారు. నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మీ, అటవీ శాఖ సహాయ కన్జర్వేటర్‌ జ్యోతి బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. 


ఉద్రిక్తతల నడుమ మృతదేహాల తరలింపు 

ఏలూరు క్రైం : పిడుగుపాటు వల్ల చనిపోయిన కార్మికులను ఆదుకోవాలని పరిహారం చెల్లించాకే మృత దేహాలను తరలించాలంటూ వ్యవసాయ కార్మిక సం ఘం నాయకులు ఆందోళన చేయడంతో బుధవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులను రప్పించకుండా తోటి కూలీలను భయపెట్టి కేవలం పాతిక వేలు వారి చేతుల్లో పెట్టి బలవంతంగా మృతదేహాలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి మృతదేహాలను బాధితుల స్వగ్రామానికి పోలీస్‌ బందోబస్తు మధ్య తరలించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ రామకృష్ణ, సీఐటీయూ నాయకులు పి.కిషోర్‌ మాట్లా డుతూ మృతుల కుటుంబాలకు ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండా అటవీ శాఖ అధికారులు కూలీలను తెచ్చిన కాంట్రాక్టర్‌తో కుమ్మక్క య్యారని ఆరోపించారు. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. పి.సత్యనారాయణ, ముత్యాలమ్మ, ఆర్‌.ఎల్లమ్మ, సీఐటీయూ నాయకులు సాయిబాబు, జె.గోపీ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:12:11+05:30 IST