చాణ‌క్య నీతి: ఈ నాలుగింటితో క‌లిసి ఉండ‌టం అంటే చావును కొనితెచ్చుకున్న‌ట్టే.. మ‌న‌కెందుకులే అనుకుంటే.. జీవితంలో ముందుకు వెళ్ల‌లేరు.

ABN , First Publish Date - 2021-10-17T17:44:21+05:30 IST

చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తులపై, జరుగుతున్న సంఘటనలపై దృష్టి సారించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలియకపోతే మీరు ఎప్పుడైనా మోసపోవచ్చు. మరణాన్ని కొనితెచ్చుకోవ‌చ్చు.

చాణ‌క్య నీతి: ఈ నాలుగింటితో క‌లిసి ఉండ‌టం అంటే చావును కొనితెచ్చుకున్న‌ట్టే.. మ‌న‌కెందుకులే అనుకుంటే.. జీవితంలో ముందుకు వెళ్ల‌లేరు.

చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తులపై, జరుగుతున్న సంఘటనలపై దృష్టి సారించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలియకపోతే మీరు ఎప్పుడైనా మోసపోవచ్చు. మరణాన్ని కొనితెచ్చుకోవ‌చ్చు. ఆచార్య చాణక్య భారతదేశంలోని ఉత్తమ పండితులలో ఒకరు. చాణక్య త‌న అధ్యయనం, అనుభ‌వాల‌ ద్వారా చాణక్య నీతిని మ‌న‌కు అందించారు. చాణక్య నీతి.. వ్యక్తికి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఎన్నో ఏళ్లు గ‌డిచిన‌ప్ప‌టికీ చాణక్య నీతి గొప్ప‌ద‌నం అలాగే నిలిచి ఉండటానికి ఇదే కారణం. చాణ‌క్య నీతిలో తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఎవ‌రైనా స‌రే జీవితంలో కొన్ని కీల‌క విషయాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే వారు చావును కొనితెచ్చుకున్న‌వార‌వుతారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


దుర్మార్గపు భార్య: చాణక్య నీతిలో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం భార్య యోగ్యురాలైతే భర్త విజయానికి దోహదం చేస్తుంది. భార్య ఎంతో సామర్థ్యం, తెలివితేట‌లు కలిగిన వ్యక్తి అయితే భ‌ర్త ఈ భూమిపైనే  స్వర్గాన్ని అందుకుంటాడు. అయితే భార్య మోస‌గ‌త్తె అయిన‌ప్పుడు, బాధ్యతలను విస్మరించి, తప్పుడుగా ప్రవర్తించినప్పుడు.. అలాంటి భార్య విష‌యంలో భ‌ర్త ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భార్య త‌ప్పుడు ప్ర‌వ‌ర్త‌న భ‌ర్త‌కు హానిక‌ర‌మే కాకుండా, అది మ‌ర‌ణంతో స‌మాన‌మ‌ని చాణక్య తెలిపారు.


చెడు దారిలో న‌డిచే స్నేహితుడు: ఎవ‌రితోనైనా స్నేహం చేసేట‌ప్పుటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. చాణక్య తెలిపిన వివరాల ప్రకారం స‌మ‌స్య‌ల్లో చిక్క‌కున్న‌ప్పుడు అతనికి అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అవసరమైనప్పుడు సరైన సలహాలు అందించ‌డం,  మీ బాధ‌ను త‌న బాధ‌గా భావించడం.. ఇవే నిజమైన స్నేహితుడి ల‌క్ష‌ణాలు. మీకు తప్పుడు సలహాలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి, స్వార్థంతో కూడివుండి,  వ్య‌స‌నాల‌ గురించి తీవ్రంగా ఆలోచించే వ్య‌క్తి మీకు స్నేహితునిగా ఉండ‌టం మంచిదికాదు. చాణక్య నీతి ప్రకారం.. అలాంటి స్నేహితుడు ఆ తరువాత మీకు హాని చేసేందుకు అవ‌కాశాలుంటాయి. అందుకే మీరు అటువంటి వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలి.


మోసగాడైన‌ సేవకుడు: సేవకుడు ఎంతో విధేయునిగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. తన యజమానిని మోసం చేయడానికి లేదా యజమాని ఇచ్చిన చ‌నువును  ఆస‌రాగా చేసుకుని తప్పుగా ప్ర‌వ‌ర్తించే సేవ‌కుని విష‌యంలో జాగ్ర‌త్తగా ఉండాలి. అలాంటి సేవకుడిని ప‌క్క‌న పెట్టుకుంటే ఎప్పుడైనా చిక్కుల్లో ప‌డ్డట్టే. అలాంటి వ్య‌క్తికి ఆశ్ర‌యం ఇస్తే మ‌ర‌ణాన్ని ఆహ్వానించిన‌ట్లే!


పాముతో స‌హ‌వాసం:  చాణక్య తెలిపిన జీవ‌న విధానం ప్రకారం.. ఎవరైనాస‌రే పాముకు దగ్గరగా వెళ్లకూడదు. అది ఎప్పుడైనా కాటు వేయ‌వ‌చ్చు.  దీని అర్థం.. నిలువెల్లా విషం నిండిన‌ వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్య‌క్తితో స‌హ‌వాసం ఎప్పటికైనా మరణానికి కారణం కావచ్చు.

Updated Date - 2021-10-17T17:44:21+05:30 IST