బీజేపీకి ఝలక్‌!

Published: Fri, 01 Jul 2022 03:09:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీకి ఝలక్‌!

  • కారెక్కిన నలుగురు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు.. కేటీఆర్‌ నివాసంలో చేరిక
  • జాతీయ సమావేశాల వేళ కాషాయ పార్టీకి ఎదురుదెబ్బ
  • మోదీకి బైబై చెప్పే సమయం వచ్చింది: మంత్రి కేటీఆర్‌
  • గులాబీ కండువా కప్పుకొన్న కల్వకుర్తి కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీకి షాక్‌! పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి కొద్ది గంటల ముందు కమలనాథులకు ఎదురుదెబ్బ! ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు హైదరాబాద్‌కు విచ్చేస్తున్న సమయంలో బీజేపీకి ఝలక్‌! అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహానికి కాషాయ పార్టీ కంగుతింది! జీహెచ్‌ఎంసీలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు అనూహ్యంగా కారెక్కేశారు! టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అత్యంత గోప్యంగా ఈ చేరికలు జరిగిపోయాయి. అంతకుముందు తెలంగాణ భవన్‌లో కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్‌ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆ కార్యక్రమంలోనూ కేటీఆర్‌ పాల్గొన్నారు. బీజేపీ కార్పొరేటర్ల చేరికలు మాత్రం బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసంలో జరగడం విశేషం. కారెక్కిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్‌ బానోతు సుజాతనాయక్‌, రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ పొడవు అర్చన ప్రకాష్‌, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ డేరంగుల వెంకటేశ్‌, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సునీతా ప్రకా్‌షగౌడ్‌లు ఉన్నారు. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.


దేశ ప్రతిష్ఠను దిగజార్చుతున్న ప్రధాని మోదీ పెద్ద నియంత అని.. అనేక కుట్రలు పన్ని ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అక్రమంగా అధికారం కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని, త్వరలోనే ఆయనకు బై బై చెప్పే సమయం వస్తుందని చెప్పారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొర.. ఇక దిగిపో దొర’ అంటూ కటౌట్లు ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు బీజేపీ సర్కస్‌ కొనసాగనుందని.. దాన్ని రక్తి కట్టించడానికి ఆ పార్టీ జాతీయ నాయకులు వస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో నిజమైన దొర మోదీ ఒక్కడేనన్నారు. కేసీఆర్‌ నియంత అయితే ఆయన్ను కేంద్రంలోని దుర్మార్గపు బీజేపీ ఎప్పుడో జైల్లో పెట్టేదని అన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ పట్ల ఎనలేని అభిమానంతో ఉన్నారని.. ఇది భరించలేకనే కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నుంచి రూ.లక్షల కోట్లు ఇస్తున్నా.. ఎటువంటి అభివృద్ధీ చేయని ప్రధాని, జాతీయ సదస్సు పేరుతో హైదరాబాద్‌కు రావడం సరికాదన్నారు. ఆయనతో సహా బీజేపీ జాతీయ నాయకులంతా తెలంగాణ ప్రజలకు సెల్యూట్‌ చేసి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. టూరిస్టుల్లాగా వచ్చివెళ్తున్న బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్‌ బిర్యానీ తిని, ఇరానీ చాయ్‌ తాగి పోవాలని ఎద్దేవా చేశారు. పార్టీలోకి కొత్తనీరు రావడం హర్షించదగ్గ విషయమని.. కొత్తనీరు, పాతనీరు కలయికతో పనిచేస్తేనే పార్టీకి బలం పెరుగుతుందని చెప్పారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ రాష్ట్ర ప్రజలను వేడుకోవడం హాస్యాస్పదమన్నారు. 


టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చెప్పండి 

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన కొందరు నేతలు మూడు రోజులు నిద్ర చెయ్యడానికి రానున్నారని.. అలా వచ్చేవారికి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని గురించి చెప్పాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అన్ని రకాల అభివృద్ధిని చూపించి బీజేపీ నాయకుల కళ్లు తెరిపించాలని కోరారు. తాము ఎన్నికల కోసం ఆరు నెలలు కేటాయిస్తే మిగతా సమయం అభివృద్ధికి కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 


హైడ్రామా.. అత్యంత గోప్యంగా.. 

కాషాయ పార్టీ కార్పొరేటర్లను కారెక్కించుకునేందుకు కొన్నాళ్లుగా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల్లోని కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. బీజేపీ జాతీయ సమావేశాలకు వేదికగా హైదరాబాద్‌ ఖరారు కావడంతో ఆకర్ష్‌ వ్యూహాలకు టీఆర్‌ఎస్‌ మరింత పదును పెట్టింది. జాతీయ సమావేశాలకు ముందే కార్పొరేటర్లకు గులాబీ కండువా కప్పడం ద్వారా బీజేపీకి ఝలక్‌ ఇవ్వడంతోపాటు అగ్ర నేతల వద్ద రాష్ట్ర నాయకుల ప్రాధాన్యాన్ని తగ్గించినట్లవుతుందని భావించారు. ఈ క్రమంలో కార్పొరేటర్లతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. బుధవారం రాత్రి వరకు టీఆర్‌ఎ్‌సతో టచ్‌లోఉన్న ఆరుగురు కార్పొరేటర్లు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గురువారం ఉదయం నుంచి హైడ్రామా మొదలైంది. ఇద్దరు కార్పొరేటర్లు.. సమావేశాల తర్వాత  చూద్దామని వెనకడుగు వేయగా.. నలుగురు సిద్ధమైనట్టు తెలిసింది. ఆ నలుగురూ చేజారకుండా స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు కార్పొరేటర్ల ఇళ్ల వద్ద నిఘా పెట్టడంతోపాటు మధ్యాహ్నం కేటీఆర్‌ నివాసానికి తీసుకొచ్చారు. కేటీఆర్‌ వారితో మాట్లాడి, భవిష్యత్తులో కల్పించనున్న అవకాశాలు, ఇతరత్రా అంశాలపై హామీ ఇవ్వడంతో..  గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ మొత్తం తతంగంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గోపినాథ్‌, నాగేందర్‌, సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు కీలకంగా వ్యవహరించారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.


అధిక సంతానం కేసులే అస్త్రాలు?

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మూడు వారాల్లోనే జీహెచ్‌ఎంసీలోని నలుగురు కార్పొరేటర్లు బీజేపీకి బై బై చెప్పడం గమనార్హం.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బీజేపీని దెబ్బకొట్టేందుకు ప్రత్యేక వ్యూహం రచించింది. ‘ఇప్పుడు చేరింది నలుగురే. మున్ముందు చూడం డి’ అని నగరానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో వ్యాఖ్యానించడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో కూడా కొందరు కార్పొరేటర్లు, నేతల చేరికలుంటాయని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా..ముగ్గురు పిల్లలున్న, ఇతరత్రా కేసులు, న్యాయపరమైన చిక్కులున్న వారిపై అనర్హత కోసం కోర్టుల్లో కేసులు వేయడంపైనా టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఫలితాలు వెలువడగానే కేసులు కూడా వేసింది. ఆ అస్త్రాన్నే ఆకర్ష్‌కు వాడుకుంది. ప్రస్తుతం కారెక్కిన నలుగురిలో ముగ్గురు కార్పొరేటర్లపై ‘అధిక సంతానం’ పిటిషన్లు కోర్టు విచారణలో ఉన్నాయి. హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాత నాయక్‌ భర్త రాంచందర్‌ నాయక్‌ కేటీఆర్‌ క్లాస్‌మేట్‌ కావడం.. ఆమె పార్టీ మారడానికి మరో కారణంగా చెబుతున్నారు. 


ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ గురించి ఆంధ్రజ్యోతి 40 రోజుల కిందటే చెప్పింది. మే 20న ప్రధాన సంచికలో ‘బీజేపీ కార్పొరేటర్లకు గాలం’ శీర్షికన కథనం ప్రచురించింది. అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ఆకర్ష్‌ అని పేర్కొనగా.. ఇప్పుడు అదే నిజమైంది. నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీ కార్పొరేటర్లతో చర్చలు జరుపుతూ బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నారు. గురువారం చేరిన నలుగురు కార్పొరేటర్లు నాలుగు నియోజకవర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.