తిరుమల ఘట్‌లో నాలుగు చోట్ల జారిన ఘాట్‌రోడ్‌ సైడ్‌ బేస్‌

ABN , First Publish Date - 2021-11-24T08:14:30+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షానికి తిరుమల ఘాట్‌రోడ్లు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి.

తిరుమల ఘట్‌లో నాలుగు చోట్ల   జారిన ఘాట్‌రోడ్‌ సైడ్‌ బేస్‌
రెండో ఘాట్‌రోడ్డులో జారిన ఘాట్‌రోడ్డు సైడ్‌బేస్‌

మరమ్మతుల సలహాల నిమిత్తం రానున్న నిపుణుల బృందం


తిరుమల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీ వర్షానికి తిరుమల ఘాట్‌రోడ్లు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. గురువారం ఒకరోజే దాదాపు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో శ్రీవారిమెట్టు నడకమార్గంలో నాలుగు ప్రదేశాలు తీవ్రస్థాయిలో దెబ్బతినగా, రెండు ఘాట్‌రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండో ఘాట్‌రోడ్డులో దాదాపు 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ సైజులోని బండరాళ్లు, మట్టిపెళ్లలతో బీభత్సం సృష్టించింది. మరోవైపు దాదాపు 20 ప్రాంతాల్లోని చెట్లు కూడా రోడ్డుకు అడ్డుగా పడిపోయాయి. ఇక, ఘాట్‌రోడ్లకు భద్రతగా ఉండే సైడ్‌బేస్‌ రెండో ఘాట్‌లో మూడు ప్రాంతాల్లో జారిపోవడం టీటీడీ అధికారులను కలవరపెడుతోంది. దీంతోపాటు తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటిఘాట్‌రోడ్డులోనూ అక్కగార్ల ఆలయ సమీపంలో ఘాట్‌రోడ్డు సైడ్‌బేస్‌ జారిపోయింది. అధికారులు అప్రమత్తమై మరింతగా రోడ్డుకిందకు జారిపోకుండా ఇసుక బస్తాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రెండుఘాట్‌రోడ్లలోని నాలుగు ప్రాంతాల్లో సైడ్‌బే్‌సలు కిందకి జారిపోవడంతో పాటు అనేక ప్రదేశాల్లో కొండచరియలు పడిన నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదేస్థాయిలో మరోసారి వర్షం కురిస్తే ఘాట్‌రోడ్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశముందని భావించి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీనికోసం చెన్నైకు చెందిన ఐఐటీ ప్రొఫెసర్లను టీటీడీ ఆహ్వానించింది. ఈ మేరకు నరసింహారావు, కొండలరావు, ప్రసాద్‌ వంటి నిపుణులతో కూడిన బృందం బుధ, గురువారాల్లో రెండు ఘాట్‌రోడ్లను పరిశీలించనుంది. ఇప్పటికే ప్రమాదానికి గురైన ప్రాంతాలను పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలపై టీటీడీకి సూచనలు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రమాదంగా మారే ప్రాంతాలనూ గుర్తించి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సలహాలు ఇవ్వనున్నారు. గతంలోనూ ఈ బృందం పలుమార్లు ఘాట్‌రోడ్లను సందర్శించి తరచూ రాళ్లు పడే ప్రదేశాల్లో ఇనుపకంచెలు, సిమెంట్‌పూత, ఇనుప రాడ్ల ఏర్పాటు తదితరాలపై సూచనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. వీటితో పాటు వర్షం కురిసిన సందర్భాల్లో నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి రోడ్డు కోతకు గురికాకుండా తగిన సూచనలు చేయనున్నారు. ఘాట్‌రోడ్డుకు వెంబడి ఉండే చెట్లు భారీ గాలులు వీచినప్పుడు కూలితే వాటి వేర్ల ద్వారా మట్టి, బండరాళ్లతో కూడిన కొంచ చరియలు విరిగిపడిపోతుంటాయి. ఈ అంశాన్ని కూడా ఈ నిపుణుల బృందం గతంలో టీటీడీ దృష్టికి తీసుకురాగా కొన్ని ప్రాంతాల్లో తొలగించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-24T08:14:30+05:30 IST