Congress MP : శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

ABN , First Publish Date - 2022-08-11T20:53:44+05:30 IST

కాంగ్రెస్ (Congress) నేత, మాటల మాంత్రికుడు శశి థరూర్‌

Congress MP : శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ (Congress) నేత, మాటల మాంత్రికుడు శశి థరూర్‌ (Shashi Tharoor)కు ఫ్రాన్స్ (France) అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. విశిష్టమైన పౌర లేదా సైనిక ప్రతిభను చూపినవారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 1802లో నెపోలియన్ బోనపార్టీ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. రచనలు, ప్రసంగాల్లో ప్రతిభకు గుర్తింపుగా దీనిని శశి థరూర్‌కు ఇస్తున్నారు. 


షెవలియర్ డీ లా లెజియన్ డీహొన్నేర్ (ది లెజియన్ ఆఫ్ ఆనర్) ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారం. రచనలు, ప్రసంగాల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శించే శశి థరూర్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబారి ఓ లేఖ ద్వారా ఆయనకు ఈ సమాచారాన్ని తెలిపారు. ఫ్రెంచ్ ప్రభుత్వ మంత్రి ఎవరైనా భారత దేశ పర్యటనకు వచ్చినపుడు ఈ పురస్కారాన్ని థరూర్‌కు ప్రదానం చేస్తారు.  


ట్విటర్ వేదికగా వెల్లువెత్తిన అభినందనలపై శశి థరూర్ ఓ ట్వీట్‌లో స్పందించారు. ‘‘ఫ్రాన్స్‌తో మన సంబంధాల పట్ల సంతోషించేవారిలో, ఫ్రెంచ్ భాషను ప్రేమించేవారిలో, ఆ సంస్కృతిని ఇష్టపడేవారిలో ఒక వ్యక్తిగా నన్ను ఈ విధంగా గుర్తించడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఈ విశిష్టతను ప్రదానం చేయడానికి నేను తగిన వ్యక్తినని భావించినవారందరికీ నా కృతజ్ఞతలు, వారిపట్ల నా గౌరవ భావాన్ని ప్రకటిస్తున్నాను’’ అని తెలిపారు. 


శశి థరూర్ 2010లో స్పానిష్ ప్రభుత్వం నుంచి ఇటువంటి పురస్కారాన్ని పొందారు. ఆయనను గౌరవిస్తూ ఎంకోమీండా డీ లా రియల్ ఆర్డర్ ఎస్పానోలా డీ కార్లోస్ 3ని స్పెయిన్ రాజు ప్రకటించారు. 


కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి శశి థరూర్ రెండుసార్లు విజయం సాధించారు. విదేశీ వ్యవహారాలపై పార్లమెంటు స్థాయీ సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఆయన మానవ వనరుల అభివృద్ధి, విదేశీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. ఆయన అత్యంత అరుదైన ఆంగ్ల పదాలను తన ట్వీట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. 


థరూర్ గత ఏడాదిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రెంచ్‌ భాషలో ప్రసంగించి ఎంబసీ, కాన్సులేట్లు, అలయెన్స్ ఫ్రాంకాయిస్, మిలిటరీ అటాచెస్ అధికారులను ఆశ్చర్యపరిచారు. 


Updated Date - 2022-08-11T20:53:44+05:30 IST