France: 2025 నాటికి 20వేల మంది భారత విద్యార్థులే లక్ష్యంగా సరికొత్త ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-06T16:06:40+05:30 IST

2025 నాటికి 20వేల మంది భారత విద్యార్థులు తమ దేశంలో చదువుకునేలా ఫ్రాన్స్ సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది.

France: 2025 నాటికి 20వేల మంది భారత విద్యార్థులే లక్ష్యంగా సరికొత్త ప్రణాళిక

ఇంటర్నెట్ డెస్క్: 2025 నాటికి 20వేల మంది భారత విద్యార్థులు తమ దేశంలో చదువుకునేలా ఫ్రాన్స్ సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇది రెండు దేశాల మధ్య కొత్త వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టిస్తుందని ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో ఫ్రాన్స్ అధికారులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో భేటీ అనంతరం ఫ్రాన్స్ ఈ ప్రకటన చేసింది. ఇక మోదీ, మేక్రాన్ భేటీలో రెండు దేశాల మధ్య అక్రమ వలసలను నిరోధించడానికి, విద్యార్థులు, నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులలో చైతన్యాన్ని కలిగించే మార్గాలపై చర్చలు జరిగాయి. దీనిలో భాగంగానే తమ దేశంలో భారత విద్యార్థుల సంఖ్యను పెంచుకునేలా ప్లాన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025 నాటికి ఫ్రాన్స్‌లో 20వేల మంది భారత విద్యార్థులు ఉండేలా, వారికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ సమాకుర్చడంతో పాటు విద్యార్థులను ఆకర్షించేలా ప్రత్యేక మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. 


ఇలా భారత విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించి తమ దేశానికి రప్పించే వ్యూహంలో ప్రాన్స్ ఉంది. అధిక సంఖ్యలో ఇండియన్ స్టూడెంట్స్ తమ దేశంలో విద్యను అభ్యసించడం వల్ల ఇరు దేశాల మధ్య కొత్త వ్యాపారాలు, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టిస్తుందని ఫ్రాన్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, 2019లో 10వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫ్రాన్స్‌ను ఎంచుకున్నారు. ఆ తర్వాత 2020, 2021లో కూడా ఫ్రాన్స్ భారీ సంఖ్యలోనే భారత విద్యార్థులకు ఆహ్వానం పలికింది. కానీ, కరోనా కారణంగా ఈ సంఖ్య కొంచెం తగ్గినట్లు సమాచారం. అయితే, మహమ్మారి సమయంలోనూ భారత విద్యార్థులకు కావాల్సిన ప్రత్యేక సదుపాయాలను కల్పించడంలో ఫ్రాన్స్ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. ఇక అక్టోబర్ 1, 2021 నుండి అమల్లోకి వచ్చిన మైగ్రేషన్, మొబిలిటీపై భాగస్వామ్య ఒప్పందం అమలుకై ఇరు దేశాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. 

Read more