ఫ్రాన్స్‌లో కొవిడ్ ఉధృతి.. ఒక్కరోజే!

ABN , First Publish Date - 2020-10-26T19:50:12+05:30 IST

ఫ్రాన్స్‌లో మహమ్మారి కరోనావైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 52వేల పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఫ్రాన్స్‌లో కొవిడ్ ఉధృతి.. ఒక్కరోజే!

పారిస్: ఫ్రాన్స్‌లో మహమ్మారి కరోనావైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 52వేల పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒకేరోజు 52,010 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 11,38,507కు చేరింది. కాగా, ఇప్పటివరకు 1,10,322 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అలాగే నిన్న ఒక్కరోజే 116 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాలు 34,761కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 9,93,424 యాక్టివ్ కేసులు ఉండగా... 2,500 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 


ఇక దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున ఫ్రెంచ్ ప్రభుత్వం అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించే విషయమై ఆలోచిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే 46 మిలియన్ల దేశ ప్రజలను(ఫ్రెంచ్ జనాభాలో మూడింట రెండు వంతుల మంది) ఆరు వారాల పాటు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్టేహోం పాటించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే అక్టోబర్ 24న జాతీయ అసెంబ్లీ దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని 2021, ఫిబ్రవరి 16 వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. కాగా, అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. మొదటి నాలుగు స్థానాల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. ఇదిలాఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటివరకు 11.59 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. 4.33 కోట్ల మందికి ప్రబలింది.  

Updated Date - 2020-10-26T19:50:12+05:30 IST