కోవిడ్ పరీక్షల్లో మోసాలు... ఏం చేస్తున్నారంటే...

ABN , First Publish Date - 2021-04-11T21:57:27+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చాలా బాధ్యతాయుతంగా

కోవిడ్ పరీక్షల్లో మోసాలు... ఏం చేస్తున్నారంటే...

బెంగళూరు : కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన సిబ్బంది మోసానికి పాల్పడటం శోచనీయం. బెంగళూరులోని కొడిగెహళ్ళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సిబ్బంది ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారి శాంపిల్స్‌ను తీసుకోకుండా, కొత్త స్వాబ్‌లను సీసాలలో పెట్టి, వాటిని  ల్యాబొరేటరీలకు పంపిస్తున్నారు.  కొడిగెహళ్ళి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ప్రేమానంద్  ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


కోవిడ్ లక్షణాలు ఉన్నవారి ముక్కు, గొంతు నుంచి శాంపిల్స్ తీయడానికి స్వాబ్స్‌ను ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు పీహెచ్‌సీ ఉద్యోగులు కొత్త స్వాబ్స్‌ను తీసి, వాటితో శాంపిల్స్ తీయకుండానే, నేరుగా సీసాల్లో పెడుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ సీసాలను పరీక్షల కోసం ల్యాబొరేటరీలకు పంపిస్తారు. వీరిద్దరూ ఈ పని చేసేటపుడు కొందరు మహిళలు కూడా అక్కడ ఉన్నట్లు మాటలనుబట్టి తెలుస్తోంది. ఈ వీడియోను చూసినవారు డాక్టర్ ప్రేమానంద్‌కు సమాచారం అందించారు. వెంటనే డాక్టర్ ప్రేమానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ ఇద్దరు సిబ్బందిని పది నెలల క్రితమే స్వాబ్ కలెక్టర్స్‌గా నియమించినట్లు తెలుస్తోంది. వీరిని శనివారం డిస్మిస్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోలో కనిపించకుండా, మాట్లాడిన మహిళా సిబ్బందిని కూడా గుర్తించినట్లు సమాచారం. 


Updated Date - 2021-04-11T21:57:27+05:30 IST