జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి...

ABN , First Publish Date - 2021-05-17T16:07:44+05:30 IST

జై జవాన్‌ కాలనీకి చెందిన పద్మ, రజియా, సబిత, జయమ్మలకు...

జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి...

  • న్యాయం చేయాలంటున్న బాధితులు 


హైదరాబాద్/ఏఎస్‌రావునగర్‌ : జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో నలుగురు మహిళలకు పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన ఓ పారిశుధ్య జవాను తమను మోసం చేశాడని బాధితురాళ్లు వాపోయారు. అంతేగాక పనిచేసిన నెలరోజులకు జీతాలు కూడా ఇవ్వలేదని శనివారం సాయంత్రం వారు తమ బాధను వెల్లబోసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ జై జవాన్‌ కాలనీకి చెందిన పద్మ, రజియా, సబిత, జయమ్మలకు సర్కిల్‌ శానిటేషన్‌ విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని జవాన్‌ దశరథ నెలన్నర క్రితం ఒక్కొక్కరి నుంచి రూ.40వేల చొప్పున మొత్తం రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. 


జై జవాన్‌కాలనీ పరిసర ప్రాంతాలలో నెలరోజులుగా వీరితో పారిశుధ్య పనులు సైతం చేయించాడు. నెలరోజులు పూర్తయిన అనంతరం వేతనం గురించి అడగ్గా ఇదిగో..అదిగో అంటూ సమాధానం చెబుతూ కాలం వెళ్లదీశాడు. చివరకు తాము మోసపోయామని గ్రహించిన సదరు బాధితురాళ్లు తమకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన జవాన్‌ దశరథపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా జవాన్‌ల మధ్యవర్తిత్వంతో కాప్రా సర్కిల్‌కు చెందిన సంబంధిత అధికారులు ఇలా ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు దండుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు దృష్టిసారిస్తే మరింతమంది బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.  జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌చేస్తున్నారు.

Updated Date - 2021-05-17T16:07:44+05:30 IST