కాల్‌గర్ల్స్‌ పేరిట మోసం

ABN , First Publish Date - 2021-07-25T06:17:34+05:30 IST

కాల్‌ గర్ల్స్‌ను పంపిస్తామని చెబుతూ ఆన్‌లైన్‌లో మోసం చేస్తున్న ముఠాను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

కాల్‌గర్ల్స్‌ పేరిట మోసం

  1. ఇద్దరు నిందితుల అరెస్టు  
  2. 31 సెల్‌ ఫోన్లు, ఒక కారు సీజ్‌ 


కర్నూలు, జూలై 24: కాల్‌ గర్ల్స్‌ను పంపిస్తామని చెబుతూ ఆన్‌లైన్‌లో మోసం చేస్తున్న ముఠాను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తెలుగు జనార్దన్‌ (పగిడ్యాల, ప్రస్తుతం కర్నూలు మిలిటరీ కాలనీ), ప్రవీణ్‌ కుమార్‌ (శ్రీరాంనగర్‌)ను అరెస్టు చేశామని సీఐ వెంకటరమణ తెలిపారు. ఇద్దరు నిందితులు వరుసకు బావ, బావమరుదులు. మార్కెటింగ్‌ యాప్స్‌ను ఉపయోగించుకుని కాల్‌ గర్ల్స్‌ను సప్లయ్‌ చేస్తామని ఆన్‌లైన్‌లో యాడ్స్‌ ఇస్తారు. యువతుల అశ్లీల చిత్రాలను చూపించి ఎర వేస్తారు. యువతులతో అశ్లీల వీడియో కాల్స్‌ చేయిస్తామని నమ్మిస్తారు. ముందుగా రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించాలని చెబుతారు. ఈ యాడ్స్‌ చూసి ఆకర్షితులైన వారు వీరికి ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా డబ్బులు పంపుతారు. ఆ తర్వాత డబ్బు పంపినవారి నెంబరును బ్లాక్‌ లిస్టుల్లో పెట్టేస్తారు. మోసపోయింది చిన్న మొత్తమే కాబట్టి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరి కొంత మంది ఇలాంటి అశ్లీల వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమకు చీవాట్లు పెడతారని భయపడి ముందుకు రావడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని రెండేళ్లుగా ఇద్దరు నిందితులు దందా సాగిస్తున్నారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బాధితుల్లో ఒకరు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని, ఫోన్‌ పే, గూగుల్‌ పే అకౌంట్‌ నెంబర్ల ద్వారా ట్రేస్‌ చేసి వివరాలను సేకరించామని సీఐ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఓ కారు, స్కూటీ, 31 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపామని సీఐ తెలిపారు. ఎవరూ ఆన్‌లైన్‌లో ఇలాంటి యాడ్స్‌ చూసి మోసపోవద్దని ఆయన సూచించారు.

Updated Date - 2021-07-25T06:17:34+05:30 IST