సీఎం ఆఫీసులో ఉద్యోగం పేరిట కుచ్చుటోపీ.. అనుకోకుండా పోలీసులకు చిక్కిన మోసగాడు

ABN , First Publish Date - 2021-12-20T06:34:33+05:30 IST

ప్ర‌భుత్వ ఉద్యోగం ఏదైనా స‌రే ల‌క్ష‌లు ఇస్తే త్వ‌ర‌గా వస్తుందని నమ్మబలికి.. అపాయింట్‌మెంట్ లెట‌ర్ కూడా రెండు రోజుల్లో అందించి మరీ అమాయ‌కుల‌ను మోసం చేసే ఒక కేటుగాడిని పోలీసులు అనుకోకుండా అరెస్టు చేశారు...

సీఎం ఆఫీసులో ఉద్యోగం పేరిట కుచ్చుటోపీ.. అనుకోకుండా పోలీసులకు చిక్కిన మోసగాడు

ప్ర‌భుత్వ ఉద్యోగం ఏదైనా స‌రే ల‌క్ష‌లు ఇస్తే త్వ‌ర‌గా వస్తుందని నమ్మబలికి.. అపాయింట్‌మెంట్ లెట‌ర్ కూడా రెండు రోజుల్లో అందించి మరీ అమాయ‌కుల‌ను మోసం చేసే ఒక కేటుగాడిని పోలీసులు అనుకోకుండా అరెస్టు చేశారు. ఈ సంఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో జ‌రిగింది.


బీహార్‌లోని పాట‌లీపుత్ర న‌గ‌రంలో ఇటీవ‌ల రోడ్డుపై ఇద్ద‌రు వ్య‌క్తులు గొడ‌వ‌ప‌డుతుండ‌గా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో ఒక‌రైన వివేక్ కుమార్ మ‌రొక వ్య‌క్తి అనిల్ సింగ్ త‌న‌ను ఉద్యోగం పేరిట‌ మోసం చేశాడ‌ని పోలీసుల‌కు చెప్పాడు. దీంతో పోలీసులు అనిల్ సింగ్ గురించి విచార‌ణ చేశారు. అత‌డి ఇంట్లో సోదా చేయ‌గా.. అక్క‌డ సీఎం ఆఫీసుకు సంబంధించి ఒక ప్ర‌భుత్వ సీల్, డీజీపీ కార్యాల‌యం ముద్ర‌, అలాగే డిప్యూటీ సీఎం లెట‌ర్ ప్యాడ్ ల‌భించింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు మ‌రింత దర్యాప్తు చేయ‌గా.. అనిల్ సింగ్‌పై ఇదివ‌ర‌కే చీటింగ్ కేసులున్న‌ట్లు తెలిసింది. వివేక్ కుమార్ వ‌ద్ద సీఎం ఆఫీసులో ఉద్యోగం రెడీ అంటూ ఒక అపాయింట్‌మెంట్ లెట‌ర్ ఇచ్చి అత‌ని వ‌ద్ద ల‌క్ష రూపాయ‌ల‌తోపాటు ఒక ల్యాప్‌టాప్ కూడా అనిల్ సింగ్ తీసుకున్నాడు. ఆ త‌రువాత త‌న మొబైల్ స్విచాఫ్ చేసి పారిపోయాడు. కొన్ని రోజుల త‌రువాత వివేక్ కుమార్ అనుకోకుండా రోడ్డుపై అనిల్ సింగ్‌ని చూసి ప‌ట్టుకున్నాడు. అక్క‌డ వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుండ‌గా.. పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ సింగ్‌పై పోలీసులు చీటింగ్ కేసు న‌మోదు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Updated Date - 2021-12-20T06:34:33+05:30 IST