సేద్యానికి ఉచిత బోర్లు

ABN , First Publish Date - 2020-07-06T11:00:17+05:30 IST

వ్యవసాయానికి ఉచితంగా బోర్లు తవ్వే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా చెప్పినట్లు ..

సేద్యానికి ఉచిత బోర్లు

కాంట్రాక్టర్ల ద్వారానే తవ్వకాలు 

రిగ్గుల కొనుగోలులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

‘ఉపాధి’ నిధుల ఖర్చు? 


కలికిరి, జూలై 5: వ్యవసాయానికి ఉచితంగా బోర్లు తవ్వే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా చెప్పినట్లు ప్రభుత్వం రిగ్గులు కొనకుండా.. కాంట్రాక్టర్ల ద్వారా తవ్వించనుంది. ఈ దిశగా మార్గదర్శకాలు జారీ చేసింది. తొలుత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటి.. లోక్‌సభ పరిధిలో మరొకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 200 రిగ్గులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిగా తర్జన భర్జనలు పడ్డాక.. ఆ ప్రయత్నాలను విరమించుకుంది. లోక్‌సభ నియోజక వర్గానికి ఒకరు చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేసింది. భూగర్భ జలాన్వేషణ బాధ్యతా కాంట్రాక్టరుదే.


బోరు పాయింట్‌ నిర్ధారణ సమయంలో వాల్టా చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా కాంట్రాక్టర్లు తవ్వే బోర్లలో కనీసం 80 శాతం విజయవంతమైతేనే పూర్తి బిల్లులు చెల్లిస్తారు. అంటే వందకు 80 బోర్లు విజయవంతమైతే పూర్తిస్థాయిలో బిల్లులిస్తారు. ఒకవేళ 70 విజయవంతమైతే పదింటికి మినహాయించి 90కే బిల్లు చెల్లిస్తారు. బోరు డ్రిల్లింగ్‌ సమయంలో కనీసం గంటకు వేయి గ్యాలన్లు (4500 లీటర్లు) నీళ్లు వస్తేనే సక్సెస్‌ అయినట్లు పరిగణిస్తారు. దీంతో కాంట్రాక్టరు భూగర్భ జలాన్వేషణలో జాగ్రత్తలు తీసుకోవాలిస ఉంది. నీళ్లు పడని బోర్లను కాంట్రాక్టరే పూడ్చేయాలి. 


అర్హులు వీరే 

బోర్లు, బావులు లేని.. ఐదు ఎకరాల వరకూ పొలమున్న రైతులంతా అర్హులే. (ఎండిపోయిన బోర్లు, నిరుపయోగ బావులపై స్పష్టత లేదు). ఇందులో కనీసం రెండున్నర ఎకరాలు తప్పనిసరిగా ఒకే చోట ఉండాలి. అలా లేనప్పుడు కొందరు రైతులు ఉమ్మడిగా కలిసి ఐదెకరాలకు మించకుండా గ్రూపుగా చేరాలి. వీరు ఆయా సచివాలయాల ద్వారా పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. కాగా, అర్హులైన రైతుల సెల్‌ఫోన్‌కు అధికారులు సమాచారమిస్తారు. 


బోర్లకు ఉపాధి నిధులు? 

ఈ మార్గదర్శకాల్లో ఉచిత బోర్లకు నిధుల సమీకరణను ప్రస్తావించలేదు. ఉపాధి హామీ, వాటర్‌ షెడ్‌ పనులు చేస్తున్న డ్వామా పీడీలకు ఈ పథకం బాధ్యతలను అప్పగించడాన్ని బట్టి ఉపాధి నిధులతోనే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉచిత బోర్ల పథకాన్ని సామాజిక తనిఖీల పరిధిలోకి చేరుస్తుండటం దీనికి ఊతమిస్తోంది. బోర్లకు అంచనాలు రూపొందించడం నుంచి డ్రిల్లింగ్‌ పర్యవేక్షణ, ఎంబుక్‌ నమోదు, బిల్లుల చెల్లింపులాంటి పనులన్నీ డ్వామా క్లస్టర్‌ ఏపీడీలు ఇతర ఉపాధి సిబ్బందికి అప్పగించారు


ఆ 197 గ్రామాలకు వర్తించదు 

డార్క్‌ ఏరియాలుగా 28 మండలాల్లోని 197 గ్రామాలను ఫిబ్రవరి 27న ప్రభుత్వం నోటిఫై చేసింది. బోర్ల తవ్వకాలను నిషేధించింది. వీటిలో కుప్పం మండలంలో 25, గుడుపల్లెలో 23, బంగారుపాళెం, కలికిరి, సదుంలో ఒక్కోటి, చంద్రగిరి, చౌడేపల్లె, పాకాల, పుంగనూరు, రేణిగుంటలో రెండేసి, ఐరాల, పెనుమూరు, వెదురుకుప్పంలో మూడేసి, ఎస్‌ఆర్‌ పురం(14), రామకుప్పం (14), వి.కోట (12), శాంతిపురం (11), రామచంద్రాపురం (10), పూతలపట్టు (9), తిరుపతి (9), రామసముద్రం (9), పెద్దపంజాణి (7), కార్వేటినగరం (6), పులిచెర్ల (6),  వడమాలపేట (6), జీడీ నెల్లూరు (5), తవణంపల్లె (5), పాలసముద్రం (4) చొప్పున ఉన్నాయి. ఉచిత బోర్ల పథకం ఈ వేయడానికి అనర్హమైనవిగా పేర్కొన్నారు. ఈ గ్రామాల రైతులు దరఖాస్తు చేసుకోనవసరం లేదని స్పష్టంచేశారు. 

Updated Date - 2020-07-06T11:00:17+05:30 IST