బీసీలకు ఫ్రీ కోచింగ్‌.. స్టైపెండ్‌

ABN , First Publish Date - 2022-04-07T08:23:54+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సెంటర్లు, స్టడీ సర్కిళ్లలో ప్రత్యక్ష, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ పద్ధతిలో 1.2 లక్షల మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

బీసీలకు ఫ్రీ కోచింగ్‌.. స్టైపెండ్‌

  • గ్రూప్‌-1 అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతరులకు రూ.2 వేలు
  • ప్రత్యక్ష, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ పద్ధతిలో 1.2 లక్షల మందికి శిక్షణ
  • 16వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు.. 
  • అదే రోజు పరీక్ష.. ఫలితాలు: గంగుల


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సెంటర్లు, స్టడీ సర్కిళ్లలో ప్రత్యక్ష, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ పద్ధతిలో 1.2 లక్షల మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 20 వేల మందికి నేరుగా, 50 వేల మందికి ఆన్‌లైన్‌లో, మరో 50 వేల మందికి హైబ్రిడ్‌ విధానంలో శిక్షణ ఉంటుందన్నారు. గ్రూప్‌-1 పోస్టుకు శిక్షణ పొందే వారికి 6 నెలల పాటు ప్రతి నెల రూ.5 వేలు, ఇతర అభ్యర్థులకు 3 నెలల పాటు ప్రతి నెల రూ.2 వేలు స్టైపెండ్‌ ఇస్తామన్నారు. మాసబ్‌ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో బుధవారం ఉచిత శిక్షణకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నందున రిజర్వేషన్‌ ప్రకారం వెనుకబడిన తరగతుల(బీసీ) వారికే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అకాశం ఉందన్నారు.


ఉచిత శిక్షణ కోసం ప్రభుత్వం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తుందన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించని వారు ఉచిత శిక్షణకు అర్హులని చెప్పారు. టీఎ్‌సపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ 1, 2, 3, 4తో పాటు పోలీస్‌ ఉద్యోగాలకు కోచింగ్‌ అందిస్తామన్నారు. ఉచిత శిక్షణలో బీసీలకు 75%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5%, ఈ-బీసీలకు 5%, మైనారిటీలకు 5ు చొప్పున రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. బెంగళూరుకు చెందిన అన్‌అకాడమీ సంస్థ నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం ఉదయమే ప్రారంభమైందన్నారు. ఏప్రిల్‌ 16 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అదే రోజు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన అభ్యర్థులకు 21వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.


అంతా ఆన్‌లైన్‌లోనే: బుర్రా వెంకటేశం

ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక, ప్రవేశ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన అన్ని అధికారిక వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ దరఖాస్తు లింకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షకు ఒక్కో అభ్యర్థికి ఒక్కో తరహా ప్రశ్నపత్రం ఉంటుందని, కాపీకి ఏ మాత్రం అవకాశం ఉండదన్నారు. తప్పుడు సమాధానాలకు మైనస్‌ మార్కులు ఉంటాయని, పరీక్ష మొత్తం సైంటిఫిక్‌ పద్ధతిలో డిజైన్‌ చేశామన్నారు. 90 నిమిషాల పరీక్షకు 5 విభాగాల్లో 100 ప్రశ్నలు ఉంటాయని, అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా, మల్టీ జోనల్‌ స్థాయిలో ర్యాంకులు ప్రకటిస్తామని వెంకటేశం వివరించారు. పరీక్ష రాసిన గంటలో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష రాయని అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత శిక్షణకు అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రెగ్యులర్‌గా శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకే ప్రభుత్వ స్టయిఫండ్‌ అందిస్తామని చెప్పారు.


ఎస్సీ అభ్యర్థులకూ ఉచిత శిక్షణ

ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న ఎస్సీ యువతకూ ఉచిత శిక్షణ అందిస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రావు తెలిపారు. 33 జిల్లాల్లో 33 సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైన, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించని అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 9-18 తేదీల్లో స్వీకరిస్తామని, అకడమిక్‌ సంవత్సరంలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 19వ తేదీన మెరిట్‌ లిస్ట్‌ రూపొందించి 20 నుంచి అభ్యర్థులకు సమాచారం అందిస్తామన్నారు. 22న ధ్రువపత్రాల పరిశీలనను పూర్తి చేసి ఈ నెల 25వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభిస్తామని ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం tsstudycircle.co.in చూడాలన్నారు.’’



Updated Date - 2022-04-07T08:23:54+05:30 IST