ఉచిత కోచింగ్‌ ఎప్పుడు...?

ABN , First Publish Date - 2022-05-13T05:16:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆరేడు సంవత్సరాల తరువాత నోటిఫికేషన్‌ వెలువడడంతో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువత ఉన్నారు. కోచింగ్‌ సెంటర్లలో చేరి శిక్షణ పొందాలని చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తామని తీపి కబురు చెప్పింది. దీంతో స్థానికంగా శిక్షణ అందుతుండ టంతో నిరుద్యోగులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడు తరగతులు ప్రారంభమవుతాయోనని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఉచిత కోచింగ్‌ ఎప్పుడు...?
శిక్షణ ప్రారంభమైన మంచిర్యాలలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం

పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంలో జాప్యం

చెన్నూరు, బెల్లంపల్లిలో ప్రారంభంకాని తరగతులు

ఆయా కేంద్రాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక

ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్ల వైపు నిరుద్యోగుల చూపు

మంచిర్యాల, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆరేడు సంవత్సరాల తరువాత నోటిఫికేషన్‌ వెలువడడంతో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువత ఉన్నారు. కోచింగ్‌ సెంటర్లలో చేరి శిక్షణ పొందాలని చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తామని తీపి కబురు చెప్పింది. దీంతో స్థానికంగా శిక్షణ అందుతుండ టంతో నిరుద్యోగులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఎప్పుడెప్పుడు తరగతులు ప్రారంభమవుతాయోనని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న యువత ఏయే సెంటర్లలో ఏ ఉద్యోగానికి సరైన శిక్షణ లభిస్తుందో ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించి, ఇప్పటికే ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో చేరిపోయారు. 

అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ద్వారా...

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ప్రభుత్వపరంగా అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ద్వారా జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని గ్రంథాలయాలలో ఉచిత శిక్షణను ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు, బెల్లం పల్లి, చెన్నూరులోని శాఖా గ్రంథాలయాల్లో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక్కో శిక్షణ కేంద్రంలో 200 చొప్పున జిల్లాలో మొత్తం 600 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రతి శిక్షణ కేంద్రానికి ఒక్కో పర్యవేక్షణ అధికారిని ఇప్పటికే నియమించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో యువతీ, యువకులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయాలలో 1,26,045 పుస్తకాలు అందు బాటులో ఉండగా, అవసరమైన స్టడీ మెటీరియల్‌ తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షకులు అందరికీ మధ్యాహ్న భోజనంతోపాటు సాయంత్రం టీ అందజేస్తామని జిల్లా గ్రంథాలయశాఖ చైర్మన్‌ ప్రవీణ్‌ ప్రకటించారు. 

పూర్తయిన అభ్యర్థుల ఎంపిక...

ప్రభుత్వపరంగా ఉచిత శిక్షణను ఇచ్చే కేంద్రాల్లో చేరడానికి గత నెల 11లోపు గడువు ఇచ్చారు. మార్చి 31 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారం భంకాగా ఏప్రిల్‌ 11తో ముగిసింది. నిర్ణీత 600కు పైబడి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున అభ్యర్థులకు స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వ హించి అవసరం మేరకు ఎంపిక చేశారు. మూడు నెలలపాటు నిర్వహిం చే తరగతుల్లో భాగంగా ప్రస్తుతానికి గ్రూపు-2, 3, 4, ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  శిక్షణనిచ్చేందుకు కలెక్టర్‌ భారతి హోళికేరి సమక్షంలో ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మూడు కేంద్రాలకు కలిపి 11 మందిని నియమించారు. కంప్యూటర్‌ ఆపరేటర్లుగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గరిష్టంగా 555 దరఖాస్తులు రాగా నైపుణ్యం గల 200 మందిని ఎంపిక చేశారు. బెల్లంపల్లిలో 440 దరఖాస్తులకుగాను 206, చెన్నూరులో 255 దరఖాస్తులకు 198 మందిని ఎంపిక చేశారు.  

ప్రారంభంకాని తరగతులు...

ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగులు   ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో స్ర్కీనింగ్‌ టెస్టు ద్వారా ఎంపికైన తాము ఖాళీగా ఉండటం వల్ల సమయం వృథా అవుతున్నదని వాపోతున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం మినహా చెన్నూరు, బెల్లం పల్లిలో శిక్షణ తరగతులు ఇంకా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మంచిర్యాలలో ఉచిత తరగతులు ప్రారంభమై నిరుద్యోగులు శిక్షణ పొందుతుండగా, మిగతా రెండు చోట్ల ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా కేంద్రాల్లో అభ్యర్థుల సంఖ్యకు సరిపడా కుర్చీలు, వివిధ రకాల బుక్స్‌, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగానే తరగతులు ప్రారంభం కావడం లేదని తెలుస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, మందమర్రి పట్టణాల్లో అక్కడి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సొంత ఫౌండేషన్‌ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించగా అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించారు. రెండు ప్రాంతాల్లో దాదాపు రెండు వేలకు పైగా యువతీ, యువకులు శిక్షణ పొందుతున్నారు. అలాగే గుడిపేట 13వ పోలీస్‌ బెటాలియన్‌లోనూ ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు ఉచిత కోచింగ్‌ ఏర్పాటు చేశారు. అంబేద్కర్‌ స్టడీ సెంటర్ల ద్వారా శిక్షణ పొందాలనుకున్న అభ్య ర్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. గ్రంథాలయాల్లో త్వరగా తరగతులు ప్రారంభించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

త్వరగా ప్రారంభించాలి...

రమేష్‌, చెన్నూరు మండలం

మంచిర్యాలతోపాటే మాకు కూడా తరగతులు ప్రారంభిస్తే బాగుండేది. పోటీ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. పరీక్షల నాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయితేనే ఉపయోగం ఉంటుంది. తరగతులు ప్రారంభం అయితే అవసరమైన బుక్స్‌ అందుబాటులో ఉండి, ప్రిపరేషన్‌కు వెసలుబాటు ఉంటుంది. 

Read more