ముంగిట్లోనే ఉచిత వైద్యం

ABN , First Publish Date - 2022-05-26T05:51:01+05:30 IST

‘సిద్దిపేట జిల్లాలో నాణ్యమైన ఉచిత వైద్యం అందరికీ అందుబాటులో ఉంది. రాబోవు రోజుల్లో వైద్యానికి దిక్సూచీగా సిద్దిపేట జిల్లా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’ అంటూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జూలూరి కాశీనాథ్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

ముంగిట్లోనే ఉచిత వైద్యం

పీహెచ్‌సీల నిర్వహణపై సీసీ కెమెరాల నిఘా

మోకాలిచిప్పలు, కళ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి

జిల్లా నుంచి మంత్రి ఉన్నందునే సుసాధ్యం

నూతన డీఎంహెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి,  సిద్దిపేట, మే 25: ‘సిద్దిపేట జిల్లాలో నాణ్యమైన ఉచిత వైద్యం అందరికీ అందుబాటులో ఉంది. రాబోవు రోజుల్లో వైద్యానికి దిక్సూచీగా సిద్దిపేట జిల్లా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’ అంటూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జూలూరి కాశీనాథ్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. 

మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమయ పాలనపై చాలా ఆరోపణలు ఉన్నాయి..?

జిల్లావ్యాప్తంగా 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 45 మంది వైద్యులు ఉన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పీహెచ్‌సీలు తెరిచి ఉంచాలి. 11 పీహెచ్‌సీలను 24 గంటల పాటు తెరిచి ఉంచుతున్నాం. ఎవరైనా సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవు.  పీహెచ్‌సీలలో సీసీ కెమెరాలను అమర్చి నిఘా ఉంచుతున్నాం. పీహెచ్‌సీలను నిరంతరం పర్యవేక్షించడానికి ముగ్గురు డిప్యుటీ డీఎంహెచ్‌వోలు, ముగ్గురు ప్రోగ్రాం అధికారులతో ఆరు బృందాలను నియమించాం.

క్షేత్రస్థాయిలో ఉన్న సబ్‌సెంటర్లను ఎలా పటిష్టం చేస్తారు?

మొత్తం 194 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం 47 కొత్త భవనాలను సబ్‌సెంటర్ల నిర్వహణ కోసం నిర్మిస్తున్నారు. ఒక బస్తీ దవాఖానను సైతం నిర్మించడం జరుగుతున్నది. 28 భవనాల కోసం స్థల పరిశీలన చేస్తున్నారు. 59 పాత భవనాల మరమ్మతు పనులకు నిధులు విడుదలయ్యాయి. కొత్త భవనం ఒక్కోదానికి రూ.19లక్షల చొప్పున నిధుల కేటాయించారు. ఏడాది లోగా వీటి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  

పూర్తిస్థాయిలో నార్మల్‌ డెలివరీలు జరగడం లేదుగా?

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏప్రిల్‌ వివరాలను పరిశీలిస్తే 1156 డెలివరీలు జరిగితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 769, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 369 నిర్వహించారు. 70శాతం ప్రభుత్వ ఆస్పత్రిపైనే విశ్వాసం చూపుతున్నారు. ఇందులో దాదాపు 50శాతం నార్మల్‌ డెలివరీలే ఉన్నాయి. 90 శాతం డెలివరీలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గర్భిణులకు నార్మల్‌ అయ్యేలా వ్యాయామాలు చేయిస్తున్నాం. 

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచడానికి ఏం చేస్తున్నారు?

ఒకప్పటి ప్రభుత్వ ఆస్పత్రులకు, ఇప్పటికీ పొంతనే లేదు. పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో 12 మందికి ఉచితంగా మోకాలి చిప్ప మార్పిడి సర్జరీని విజయవంతంగా చేశాం. వందలాది మందికి కంటికి సంబంధించిన క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నాం. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఉచితంగా పరీక్షలను నిర్వహిస్తున్నాం. రోగులకు, వారి బంధువులకు ఉచితంగా భోజనం పెడుతున్నాం.

ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో దోపిడీని ఎలా నియంత్రిస్తారు?

రిజిస్ర్టేషన్‌ లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లపై కొరడా ఝుళిపిస్తాం. ముందుగా ఐఎంఏకు ఒక సర్క్యులర్‌ జారీ చేస్తాం. ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి నిరంతర పర్యవేక్షణ చేయిస్తాం. 

జిల్లాలో కరోనా భయం పూర్తిగా తొలగినట్లేనా?

ఈ విషయంలో అలర్ట్‌గానే ఉన్నాం. ప్రస్తుతం జిల్లాలో ఒక్క కేసు కూడా లేదు. పరీక్షలు పూర్తిగా తగ్గాయి. మొదటి, రెండు డోసుల వ్యాక్సిన్‌ను 107 శాతం అందించాం. 12-14ఏళ్ల పిల్లలకు 97 శాతం మొదటి డోసు ఇచ్చాం. సిద్దిపేట, గజ్వేల్‌లో కోవిడ్‌ కోసం ప్రత్యేక వార్డులను కొనసాగిస్తున్నాం. 

కొత్త డీఎంహెచ్‌వోగా మీ లక్ష్యాలేమిటీ?

జిల్లాకు చెందిన మంత్రిగారు నాకు ఈ అవకాశం కల్పించారు. ఆయనకు వైద్యరంగంపై పూర్తి అవగాహన ఉంది. మంత్రి సూచనలు, టార్గెట్లను గమ్యం చేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తాను. జిల్లావాసిగా నాపైన మరింత బాధ్యత పెరిగింది. నాణ్యమైన ఉచిత వైద్యాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లడానికి మంత్రి చేస్తున్న వినూత్న కార్యక్రమాలను అమలు చేసి జిల్లాను నంబర్‌వన్‌గా నిలపడమే నా లక్ష్యం. 

Updated Date - 2022-05-26T05:51:01+05:30 IST