ఉచితం అనుచితం!

ABN , First Publish Date - 2020-02-27T06:45:14+05:30 IST

ఉచిత పథకాలతో ప్రయోజనం శూన్యం. దీని వలన ప్రభుత్వాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా ప్రజలకు దీర్ఘకాలంలో చేటు అనడంలో సందేహం లేదు. ఉచితానుచితాలు మరచి ఉచిత పథకాలవైపే ఎదురు చూసే...

ఉచితం అనుచితం!

ఉచిత పథకాలతో ప్రయోజనం శూన్యం. దీని వలన ప్రభుత్వాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా ప్రజలకు దీర్ఘకాలంలో చేటు అనడంలో సందేహం లేదు. ఉచితానుచితాలు మరచి ఉచిత పథకాలవైపే ఎదురు చూసే పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొంటున్నాయి. ఇవి దేశాభివృద్ధికి చేటు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందించి నిర్విఘ్నంగా అమలు చేసింది. అవే ఎన్టీఆర్‌కు ‘అన్న’ అనే గౌరవ పేరును శాశ్వతం చేశాయి. అప్పటి ప్రజల స్థితిగతులను అనుసరించి అవన్నీ అవసరమైన పథకాలే. నేడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. కష్టించేవాడికి కూటికి లోటు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరం లేని సంక్షేమ పథకాలను నిరభ్యంతరంగా తొలగించాలి. వీటిపై నిష్పక్షపాతంగా సమీక్ష చేయాలి. విద్య,వైద్యం వంటి వాటిని అందరికీ ఉచితంగా అందించాలి. ఉన్నత స్థాయి విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి. అర్హులకు మాత్రమే పెన్షన్లను అందించాలి. ఆరోగ్యశ్రీ అందరికీ అందించాలి. విద్యుత్, అనేది నేటి పరిస్థితుల్లో కులమత,వర్గ బేధాలకు అతీతంగా అందరికీ అత్యవసరం. ఈ విషయంలో ప్రభుత్వం మరింత సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలి. అవసరమైన పథకాలు అమలు చేస్తూ, వాటి ద్వారా ప్రజల ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు చేపట్టాలి. ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలి. ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తూ ఒకటొకటిగా చర్యలు తీసుకుంటూ అంతిమ ఫలితాలు సాధించాలి. అటువంటి వారికే మరో సారి అధికారం లభిస్తుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అన్ని రాజకీయ పక్షాలు కేవలం ఓట్ల వేటలో పడి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప పథకాల అమలులో నిజమైన చిత్తశుద్ధి కొరవడింది. ప్రజలకు శాశ్వత మేలు చేకూర్చే ఏ పథకమైనా సత్ఫలితమిస్తుందని కేజ్రీవాల్ ‘హ్యాట్రిక్ విజయం’ నిరూపించింది. ఇదే ఆదర్శంగా పథకాలపై ముందుకు సాగాలి.

సుంకవల్లి సత్తిరాజు. సంగాయగూడెం


Updated Date - 2020-02-27T06:45:14+05:30 IST