పెదనందిపాడులో NATS ఉచిత కంటి వైద్య శిబిరం

ABN , First Publish Date - 2022-06-20T03:43:14+05:30 IST

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్).. గుంటూరులో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

పెదనందిపాడులో NATS ఉచిత కంటి వైద్య శిబిరం

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా తెలుగునాట కూడా తన సేవా పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. పెదకాకాని శంకర కంటి ఆస్పత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థలతో కలిసి నాట్స్ ఈ ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరాన్ని పెదనందిపాడు పిఎఎస్ కళాశాలలో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ,మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా హాజరయ్యారు. 


అమెరికాలోనే కాకుండా సాటి తెలుగువారి కోసం నాట్స్ ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. నాట్స్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బాపయ్య చౌదరి తను పుట్టిన గడ్డకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కృష్ణదేవరాయలు ప్రశంసించారు.  ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు బాపయ్య చౌదరి మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. 






పెదనందిపాడు గడ్డ ఎన్నో పోరాటాలకు కేంద్రబిందువుగా ఉందని, అలాంటి ప్రాంతానికి చెందిన బాపయ్య చౌదరి అమెరికాలో ఉన్నత పదవులు అధిరోహించి, తమ జన్మభూమికి సేవ చేయడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. కరోనా సందర్భంలో కూడా బాపయ్య చౌదరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పెదనందిపాడులో ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్న బాపయ్య చౌదరి దాతృత్వం గొప్పదని ప్రశంసించారు. బాపయ్య ఈ ప్రాంతానికి మరి ఎన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు. నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం వంటి ఉన్నత ఆశయాలతో స్థాపించిబడింది అని, ఆ సంస్థలో బాపయ్య చౌదరి అంచెలంచెలుగా సేవ చేస్తూ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన ప్రాంతానికి గర్వకారణమని  మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు.



ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తా: బాపయ్య చౌదరి, నాట్స్ అధ్యక్షుడు

నాట్స్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల కోసం అనేక  సేవా కార్యక్రమాలు చేస్తున్నామని  నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి తెలిపారు. విద్య, వైద్యం తదితర అంశాలపై రాబోయే కాలంలో రెండు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు., ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మిత్రులకు, గ్రామ పెద్దలకు, శంకర కంటి ఆస్పత్రి సిబ్బంది కి, వైద్యులకు తమ కృతజ్ఞతలు తెలిపారు.. ఈ శిబిరానికి 2500 మంది పరీక్షలు చేయించుకొనగా, వారిలో లో 570 మందికి ఆపరేషన్లు చేయడానికి అర్హులుగా వైద్యులు తెలిపారు, వీరిని విడతలవారీగా బస్సులు ఏర్పాటు చేసి  శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయిస్తామని బాపయ్య చౌదరి తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు మద్దతు అందిస్తామని కాకుమాను నాగేశ్వరరావు, కుర్రా హరిబాబు అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. శిబిరానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కే అనూష, ఎస్ శ్రీదివ్య, కే సంకల్ప, క్యాంప్ ఎగ్జిక్యూటివ్ బివి నాగబాబు ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ అధ్యక్షులు, బోర్డ్ అఫ్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాదల రాజేంద్ర, సభ్యులు ధూళిపాళ్ల సురేంద్ర, కాళహస్తి సత్యనారాయణ, లావు రత్తయ్య, కొల్లా రాజమోహన్ రావు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నర్రా శ్రీనివాస్, నూతి శ్రావణి, పోపూరి లక్ష్మీనారాయణ, కుర్రా హరిబాబు, నూతి శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ అరుణ గంటి అమెరికా నుండి పాత కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీలతో  కూడా సమావేశమై అందరూ.. బాపు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, టెలిఫోన్ ద్వారా బాపయ్య చౌదరికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. 


           ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి



Updated Date - 2022-06-20T03:43:14+05:30 IST