బుకింగ్ అవసరం లేదు.. టికెట్ అసలే అక్కర్లేదు.. ఈ రైలులో 73 ఏళ్లుగా ఫ్రీ జర్నీ..

ABN , First Publish Date - 2022-05-10T06:38:48+05:30 IST

భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు రైలు మార్గంలోనే ప్రయాణం చేస్తారు. రోజూ కోట్లాది మంది రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుతూ వుంటారు. అయితే ఏ రైలు బండి ఎక్కినా టికెట్ తప్పనిసరి. కానీ టికెట్ లేకుండా ఒక ట్రైన్‌లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అనే విషయం మీకు తెలుసా! అవును మీరు చదివింది నిజమే. అదే భాక్రా నంగల్‌ ట్రైన్...

బుకింగ్ అవసరం లేదు.. టికెట్ అసలే అక్కర్లేదు.. ఈ రైలులో 73 ఏళ్లుగా ఫ్రీ జర్నీ..

భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు రైలు మార్గంలోనే ప్రయాణం చేస్తారు. రోజూ కోట్లాది మంది రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుతూ వుంటారు. అయితే ఏ రైలు బండి ఎక్కినా టికెట్ తప్పనిసరి. కానీ టికెట్ లేకుండా ఒక ట్రైన్‌లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అనే విషయం మీకు తెలుసా! అవును మీరు చదివింది నిజమే. అదే భాక్రా నంగల్‌ ట్రైన్.


హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ. రైలు మార్గంలో ఈ ట్రైన్ మనకు ప్రయాణిస్తుంది. ఇది సట్లెజ్ నది మీదుగా వెళుతుంది. నంగల్ నుండి ఉదయం 7గంటల 5నిమిషాలకు ఈ రైలు బ‌య‌ల్దేరుతుంది. నంగల్ నుంచి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు పడుతుంది. ఆ తరువాత తిరుగు ప్రయాణం చేసి సుమారు 8గంటల 20నిమిషాలకు ఈ రైలు భక్రా నుండి నంగల్‌కు చేరుకుంటుంది. ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. కొండలు-కోనలు, వాగులు-వంకలు, ప్రకృతి అందాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.


భాక్రానంగల్ డ్యామ్ నిర్మాణ పనులు 1948లో మొదలయ్యాయి. కార్మికులు, భారీ యంత్రాలను తీసుకెళ్లేందుకు వీలుగా అప్పుడు రైలు మార్గాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1963లో భాక్రానంగల్ డ్యామ్‌ను ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా భాక్రా గ్రామంలో ఉంది. ఇది 741 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన డ్యామ్‌లో ఒకటిగా ఉంది. మొదట డ్యామ్ నిర్మాణానికి అవసరమమ్యే కార్మికులు, సామాగ్రిని తరలించేందుకు ఈ రైలును నడిపారు. ఆ తర్వాత అదే మార్గంలో పర్యాటకుల కోసం రైలును ఉచితంగా నడుపుతున్నారు. ఈ డ్యామ్‌ను చూసేందుకు ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు రైల్లో వస్తుంటారు.


ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరు. మొదట స్టీమ్ ఇంజిన్‌తో నడిచిన ఈ రైలు ఇప్పుడు పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో నడుస్తోంది. రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్‌లు ఉండేవి. కానీ ప్రస్తుతం 3 కోచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియదు.


ఇక ఈ రైలులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ రైలులోని అన్ని కోచ్‌లు చెక్కతో తయారు చేయబడినవి.

Read more