నవంబర్‌ వరకు ఉచిత బియ్యం

ABN , First Publish Date - 2020-07-06T10:38:26+05:30 IST

కరోనా వ్యాప్తి చెందుతుండడంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రేషన్‌ కార్డుల ద్వారా ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని నవంబర్‌ వరకు అందించాలని ప్రభుత్వం

నవంబర్‌ వరకు ఉచిత బియ్యం

ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున పంపిణీ

జిల్లాలో 6,29,381 మందికి ప్రయోజనం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కరోనా వ్యాప్తి చెందుతుండడంతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రేషన్‌ కార్డుల ద్వారా ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని నవంబర్‌ వరకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌ మాసం వరకు అదనంగా 5కిలోల బియ్యాన్ని అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చే బియ్యంతో పాటు 5 కిలోలు కలుపుకుని ఒక్కో వ్యక్తికి 10 కిలోల చొప్పున నవంబర్‌ నెల వరకు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం ప్రకటించారు. దీంతో జిల్లాలో 6,29,381 మందికి ప్రయోజనం చేకూరనున్నది. 


రాష్ట్రంలో మార్చి 22 నుంచి రెండు మాసాలకు పైగా లాక్‌డౌన్‌ అమలుకావడంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమలు, దుకాణాలు మూసివేయడంతో పేద, మధ్య తరగతి వారికి ఉపాధి లేకుండాపోయింది. దీంతో తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. సాధారణంగా ఒక వ్యక్తికి 6 కిలోలు బియ్యాన్ని కిలోకు రూపాయి చొప్పున ఇస్తుంటారు. కరోనా నేపథ్యంలో అదనంగా 6 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే నిత్యావసర సరుకుల కోసం నెలకు 1500 రూపాయల చొప్పున రెండు నెలల పాటు ఆర్థిక సాయాన్ని అందించారు.


వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ విధానాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ రెగ్యులర్‌గా ఇచ్చే బియ్యంతో పాటు అదనంగా 5 కిలోల చొప్పున నవంబర్‌ నెల వరకు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది. ఈనెల నుంచి ఒక్కోవ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని అందజేయనున్నారు. జిల్లాలో 2,15,914 కుటుంబాలకు రేషన్‌ కార్డులను జారీ చేయగా, వీటిలో 6,29.381 మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఉచిత రేషన్‌ బియ్యం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి కాస్త ఊరట లభించనున్నది. 

Updated Date - 2020-07-06T10:38:26+05:30 IST