మట్టి లే‘అవుట్‌’

ABN , First Publish Date - 2020-07-05T10:49:09+05:30 IST

పేదల ఇళ్ల స్థలాల కోసం ఉచితంగా కేటాయించిన మట్టి, కంకర పక్కదారి పడుతున్నాయి. పలు ప్రైవేట్‌ లేఅవుట్ల ఫిల్లింగ్‌కు ఈ మట్టిని

మట్టి లే‘అవుట్‌’

ప్రైవేట్‌ లేఅవుట్లకు ఉచిత మట్టి

టిప్పర్‌ మట్టి రూ.5 వేల వరకూ విక్రయం

తొర్రేడులో  50 ఎకరాల  ప్రైవేట్‌ లేఅవుట్‌కు సుద్దకొండ మట్టి

కాపవరం మెట్ట కంకరకూ దొడ్డిదారి

జిల్లాలో ప్రతీచోట ఇదే తరహాలో మట్టి , కంకర అమ్మకాలు


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల స్థలాల కోసం ఉచితంగా కేటాయించిన మట్టి, కంకర పక్కదారి పడుతున్నాయి. పలు ప్రైవేట్‌ లేఅవుట్ల ఫిల్లింగ్‌కు ఈ మట్టిని అమ్మేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ మట్టిని ఇష్టానుసారం విక్రయిస్తున్నారు. జిల్లాలో 3,08,739 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం  1667 లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ చోట్ల ఇవి పల్లపు ప్రాంతాలు కావడం వల్ల వాటిని మెరకచేయడానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ నిధులు కేటాయించడంతోపాటు జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లోనూ, మట్టి, కొండలు ఉచితంగా తవ్వుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


ఈనేపథ్యంలో  మైన్స్‌, ఇరిగేషన్‌, ఇతర శాఖల అనుమతి లేకుండానే రెవెన్యూ శాఖ అధికారులు ఇష్టానుసారం అనుమతులు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వ స్థలం దొరికితే చాలు.. అది మెరకైనా, చెరువైనా సరే మట్టి తవ్వేస్తున్నారు. కొండలను సైతం కూడా పిండిచేసేస్తున్నారు. ఈ మట్టిని, కంకరను కేవలం ఇళ్ల స్థలాల కోసం ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు మాత్రమే ఉపయోగించాలి.  కానీ ఇదంతా ఉచితం కావడం వల్ల ఇతరులకు కూడా అమ్మేస్తున్నారు. సీతానగరం మండలంలో ఇళ్ల స్థలాల పేరిట 12 ఎకరాల సుద్దకొండను తవ్వేశారు.


ఆ మట్టిని కొన్నిచోట్ల ఇళ్ల స్థలాల ఫిల్లింగ్‌కు తీసుకుని వెళ్లడంతోపాటు తొర్రేడులో     50 ఎకరాల ఓ ప్రైవేట్‌ లేఅవుట్‌లో నాలుగు అడుగుల ఎత్తున మెరక చేశారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీసి రూ.కోట్ల అక్రమాలు జరిగినట్టు తేల్చాయి. కానీ ఆ నివేదికను బయటకు రాకుండా కొందరు పెద్దలు అడ్డుకున్నట్టు  సమాచారం. పోలవరం కాల్వ మట్టిని ఇళ్ల స్థలాల మెరక పేరిట ఇష్టానుసారం విక్రయిస్తున్నారు. ఇక్కడ ఇరిగేషన్‌ అధికారుల అనుమతి లేదు. కొన్ని శాఖలకు అయితే సమాచారమే ఇవ్వడంలేదు. ఇక అనపర్తి మండలం కాపవరంలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ మెట్టను తవ్వి కంకరను కూడా అక్రమ రవాణా చేస్తున్నారు. మూడు మండలాల ప్రజలకు ఇక్కడ ఇళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇది వివాదాస్పద భూమి. చాలాకాలం కిందట రాయలసీమకు చెందిన వారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి అతి తక్కువ ధరకు ఈ భూమిని కొన్నారు. స్థానికులైన వారికే ప్రాధాన్యమిచ్చి, ఎక్కువ మందికి ఉద్యో గాలు ఇస్తామనే ఒప్పందం కూడా జరిగింది.


కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఫ్యాక్టరీ పేరిట ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన వారిపై కొందరు కేసులు కూడా పెట్టారు. తర్వాత కాలక్రమేణా వారి చేతుల నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ చేతిలోకి వచ్చింది. ఇది బ్యాంక్‌ తనఖాలో ఉంది.  అయినా ఇది ఇళ్ల స్థలాలకు ఇచ్చే సాకుతో ఇక్కడ పెద్దఎత్తున మైనింగ్‌ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ మెట్టను  తవ్వి టిప్పర్ల మీద వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మెట్టకు కొంత దూరంలో ఉన్న కాపవరం గ్రామంలో ఓ ప్రార్థనా మందిరం కోసం ఎర్రకంకరను లారీ రూ.3,500లకు విక్రయించారు. దీనికి ఓ కిలోమీటరు దూరంలో ఉన్న ఒక పొలంలో గతంలో ఎర్రకంకర మట్టి తవ్వి అమ్మేశారు. ఆ స్థలంలోకూడా ఇవాళ కొంత ఈ మెట్ట మట్టిని దాస్తున్నారు. ఇలా జిల్లాలోని దాదాపుగా అన్నిచోట్ల ఈ మట్టి, కంకర అక్రమాలు మితిమీరిపోయాయి. మట్టిని అమ్మి కొందరు రూ.కోట్లు గడిస్తున్నారు. మట్టే ఇప్పుడు వీరికి డబ్బు తెచ్చే మార్గమైంది.


Updated Date - 2020-07-05T10:49:09+05:30 IST