నిరుద్యోగులకు అండ.. ‘రాచకొండ’

ABN , First Publish Date - 2022-05-27T19:59:36+05:30 IST

నిరుద్యోగులకు ఆండగా నిలిచేందుకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ముందుకొచ్చారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తున్న చేసుకున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. చంపాపేటలోని జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో...

నిరుద్యోగులకు అండ.. ‘రాచకొండ’

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ    

గ్రంథాలయ సౌకర్యం, అల్పాహారం


చంపాపేట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఆండగా నిలిచేందుకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ముందుకొచ్చారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తున్న చేసుకున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. చంపాపేటలోని జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 4న ఎల్‌బీనగర్‌ జోన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ పి.జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుశిక్షితులైన ఫ్యాకల్టీతో సుమారు మూడు నెలల పాటు నిరుద్యోగులకు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. శిక్షణ తరగతులను రెండు బ్యాచ్‌లుగా విభజించారు. ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు 350 మంది, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మరో 350 మంది హాజరవుతున్నారు. శిక్షణలో పాల్గొనే వారికి ఉచితంగా గ్రంథాలయ సౌకర్యంతో పాటు అల్పాహారం అందిస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలేని వారు రాచకొండ సీపీ తమకు అండగా నిలవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


శిక్షణ బాగుంది.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షల కోసం సీపీ సార్‌ ఏర్పాటు చేసిన శిక్షణ బా గుంది. మంచి ఫ్యాకల్టీ ద్వారా బోధన కొనసాగుతోంది. అర్థమయ్యే రీతిలో శిక్షణ అందిస్తున్నారు. 

-బి.శివనేత, కొత్తపేట, ఎల్‌బీనగర్‌


గణితం విద్యార్థులతో పోటీపడేలా...

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోటీ పరీక్షల కోసం మంచి శిక్షణ అందిస్తున్నాం. గణితం విద్యార్థులతో పోటీ పడే విధంగా నాన్‌ గణితం విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బేసిక్‌ స్థాయి నుంచి శిక్షణలో పాఠాలు అందిస్తున్నాం. 

           -సీవీ.చలపతినాయుడు, ఫ్యాకల్టీ, పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌


ఉద్యోగం సాధిస్తాం...

ఉచిత శిక్షణతో ఉద్యోగం సాధిస్తాం. సీపీ సార్‌ చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుకువస్తాయి. కష్టపడి కాకుండా.... ఇష్టంతో చదివి  ఉద్యోగం సంపాదిస్తా. ఉచిత శిక్షణ, ఉచిత గ్రంథాలయ సౌకర్యంతో పాటు అల్పాహారం అందిస్తున్నారు. 

 -కె.మౌనిక, బండరావిరాల, హయత్‌నగర్‌  


ఉద్యోగాలు సాధించాలనే...

ఉన్నత చదువులు చదివిన వారు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించాలన్నదే సీపీ సార్‌ లక్ష్యం. శిక్షణ ఇతర ఉద్యోగాలు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఉచిత శిక్షణతో పాటు, గ్రంథాలయ సౌకర్యం, అల్పాహారం అందిస్తున్నాం.

-సీతారాం, ఇన్‌స్పెక్టర్‌, సరూర్‌నగర్‌ పీఎస్‌ 

Updated Date - 2022-05-27T19:59:36+05:30 IST