నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ లింకు, మీటర్‌ బిగింపు ఈజీ..

ABN , First Publish Date - 2021-01-25T07:15:17+05:30 IST

గృహ కనెక్షన్లకు

నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ లింకు, మీటర్‌ బిగింపు ఈజీ..

 వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించిన వాటర్‌బోర్డు 

మురికివాడల్లో ప్రత్యేక బృందాలు రంగంలోకి


హైదరాబాద్‌ సిటీ, జనవరి24 (ఆంధ్రజ్యోతి): ఉచిత మంచినీటి పథకం ప్రయోజనాలను పొందాలనుకునే వారి ఆధార్‌ అనుసంధానం, మీటర్‌ బిగింపు తదితర అంశాలలో సమస్యలు తలెత్తకుండా బోర్డు చర్యలు తీసుకుంటోంది. 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం లబ్ధి పొందాలంటే నల్లా కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకునే ప్రక్రియను వాటర్‌బోర్డు చాలా సులభతరం చేసింది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఆధార్‌ కార్డును నల్లా కనెక్షన్‌ క్యాన్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. మీసేవతో పాటు ఇతర కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను సందర్శించి.. అందులో వివరాలను పొందుపరిస్తే వెను వెంటనే అనుసంధానం ప్రక్రియ పూర్తి కానుంది. మురికివాడల్లో నివసించే పేదలు ఆధార్‌ కార్డును అనుసంధానం చేయడానికి వాటర్‌బోర్డు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఆయా బృందాలు ఇంటింటికీ తిరిగి క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ కార్డును అనుసంధానం చేస్తున్నాయి. పేరులో కరెక్షన్‌ ఉన్నా మీటర్‌ రీడింగ్‌ సిబ్బందే సరి చేస్తున్నారు. 


డయల్‌ 155313

మురికివాడలు కాక ఇతర గృహ కనెక్షన్‌ దారుల ఆధార్‌ కార్డులో పేరుకు, క్యాన్‌ నెంబర్‌లో ఉన్న పేరుకు ఏమైనా తేడాలుంటే ఆధార్‌ కార్డు అనుసంధానం జరగదు. అందుకు కూడా వెసులుబాటు కల్పించారు. సంబంధిత వెబ్‌సైట్‌లోనే పేరు కరెక్షన్‌ ఆప్షన్‌ ఎంచుకుని అందులో క్యాన్‌ నెంబర్‌ ఎంట్రీ చేసి పేరులో మార్పులు, చేర్పులు సులభంగా చేసుకోవచ్చు. పేరు కరెక్షన్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలంటే మన వద్ద గడిచిన ఆరు నెలలకు సంబంధించిన నీటి బిల్లు ఉండాలి. పేరు మార్పులోనూ, క్యాన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానంలోనూ ఏమైనా సందేహాలు తలెత్తితే వాటర్‌బోర్డు కస్టమర్‌ సర్వీస్‌ నెంబర్‌ 155313కి కాల్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.


కొనుగోలు చేయగానే...

నల్లాకు మీటర్‌ బిగింపు ప్రక్రియను కూడా వాటర్‌బోర్డు సులభతరం చేసింది. నల్లా మీటర్‌ కొనుగోలు చేసిన మరుక్షణమే ప్లంబర్‌ల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటోంది. గతంలో నల్లాకు మీటర్‌ బిగింపునకు చార్జి రూ.500లు కాగా, ప్రస్తుతం చార్జిని రూ.200లుగా నిర్ధారించారు. ఏజెన్సీలు మీటర్లను విక్రయించి చేతులు దులుపుకుంటే సరిపోదు. మీటర్‌ బిగింపు తర్వాత గ్యారంటీ పీరియడ్‌ వరకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా ఏజెన్సీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.


మీటర్లకు డిమాండ్‌

తమ గృహ కనెక్షన్లకు నీటి మీటర్లను బిగించుకోవడానికి ఎంప్యానల్‌ చేసిన ఏజెన్సీల నుంచి వినియోగదారులు మీటర్లను తీసుకుంటున్నారు. నగరంలోని ఐదు లక్షల గృహ కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు అవసరముండటంతో కొరత ఏర్పడకుండా బోర్డు కొత్తగా ఏజెన్సీలను ఎంప్యానల్‌ చేసింది. గతంలో కేవలం తొమ్మిది ఏజెన్సీలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 20కు పైగా ఏజెన్సీలను ఎంప్యానల్‌ చేసింది.

Updated Date - 2021-01-25T07:15:17+05:30 IST