Advertisement

నిజాం వ్యతిరేక పోరాటంలో తుపాకీ పట్టా..!

Jun 30 2020 @ 04:18AM

పేదలకు 400 ఎకరాల భూమి పంచా..

స్వాతంత్య్ర సమరయోధుడు మహ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌ 


ఆయన పుట్టింది పెత్తందారీ కుటుంబంలో. కానీ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టారు. సామ్యవాద సిద్ధాంతాలకు ఆకర్షితుడై నాలుగు వందల ఎకరాల భూమిని పేదలకు పంచాడు. ఆయనే స్వాతంత్య్ర సమరయోధుడు మహ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌. కరోనా కాలంలో 93ఏళ్ల మొయినుద్దీన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య రహస్యంతో పాటు ఆనాటి కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : కరోనా భయంతో నేనెవర్నీ కలవడం లేదు. దోస్తులతో పలకరింపులు, పరామర్శలన్నీ ఇప్పుడు ఫోన్లోనే నడుస్తున్నయి. ఏదైనా వస్తువు ముట్టుకొన్నా, తర్వాత చేతులకి శానిటైజర్‌ రాసుకుంటున్నా. రోజూ అర్ధరాత్రి 2.30గంటలకి నిద్రలేస్తా. ఒక కప్పు చాయ్‌ తాగి, ఖురాన్‌ చదువుతా. ఫజర్‌ (తెల్లవారుజాము ప్రార్థన) సమయానికి నమాజ్‌ చేస్తా. రోజూ ఆరింటికల్లా నాకు ఉర్దూ, ఇంగ్లిషు న్యూస్‌ పేపర్లు వస్తాయి. అందులోని వార్తలు, వ్యాసాలను క్షుణ్ణంగా చదువుతా. కరోనా వార్తలు వినలేక టెలివిజన్‌ చూడడం పూర్తిగా మానేశా. బ్రేక్‌ఫా్‌స్టలోకి పాలల్లో ఓట్స్‌ కలిపి తీసుకుంటా. ఉదయం పూట ఒక గంట నిద్రపోతా. తర్వాత నా మనమలతో కరోనా సంగతులు, వాళ్ల చదువు గురించి ముచ్చటిస్తుంటా. రోజూ అర్ధరాత్రి మూడు గంటలకి ఉడికించిన కోడిగుడ్డు ఒకటి తింటాను. మధ్యాహ్నం భోజనంలో సేమియా, రాత్రికి పుల్కా తీసుకుంటా. వయసు వల్ల అంతకు మించి మరేమీ తినడంలేదు. చిన్నప్పుడు మాత్రం చికెన్‌, మటన్‌, మీగడ, నెయ్యి, పెరుగు తినేవాడిని, పాలు బాగా తాగేవాడిని. ఇప్పటికీ నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, అప్పటి తిండే కారణమేమో.! మా ఇంటికి ఇతర మిత్రులూ భోజనానికి వస్తుంటారు. కనుక మొదటి నుంచి మా ఇంట్లో బీఫ్‌ వండేవాళ్లు కాదు. నాకు మొదటి నుంచి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. అయితే, ఇప్పుడు ఎక్కువ చదవలేకపోతున్నా. ఈ మధ్య నేను మళ్లీ చదివిన పుస్తకాలంటే, కార్ల్‌మార్క్స్‌ ‘క్యాపిటల్‌’, మహాత్మాగాంధీ ‘సత్యశోధన’. 


400 ఎకరాలు పంచా...

నా సొంతూరు సిద్దిపేట దగ్గర మంగోల్‌ గ్రామం. ఆ చుట్టుపక్కల మరో మూడు గ్రామాలకు మేము దేశ్‌ముఖ్‌లం. ఆ ఊర్లలో మాకు నాలుగు వందల ఎకరాల భూమి ఉండేది. ‘దున్నేవాడిదే భూమి’ నినాదం స్ఫూర్తితో అదంతా పేదలకి పంచాను. ఇప్పుడు నాకు సంగారెడ్డిలో 200 గజాల ఇంటి స్థలం మాత్రమే ఉంది. అదీ నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు గాను ప్రభుత్వం ఇచ్చింది. నా కుటుంబ నేపథ్యం చెప్పాలంటే... నా తండ్రి పేరు షేక్‌ అబ్దుల్లా. ఆయన పేరుకి దేశ్‌ముఖ్‌ అయినా, పేదలపట్ల కొంత కనికరం చూపేవాడు. నేను పొలం కౌలు మాఫీ చేసినా, తర్వాత భూమి అంతా పంచినా ఆయన నన్ను ఒక్కమాట అనలేదు. మా నాయన దొర కనుక, మా ఇంటి ముంగిట 24 గంటలూ ఇద్దరు మనుషులు కాపలాగా కూర్చొనేవాళ్లు. ఆ ఆనవాయితీని నేను రద్దు చేశా. మా ఇంటి ఆవరణలోని బురుజు, ప్రహరీ కూడా కూలగొట్టాను. అప్పుడూ మా కుటుంబ సభ్యులెవరూ మారు మాట్లాడలేదు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా నేనూ భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఉద్యమించా. రజాకార్ల దుర్మార్గాలనూ వ్యతిరేకించా. రజాకార్లు అంటే భూస్వామ్య వ్యవస్థని కాపాడేందుకు పుట్టిన సైనిక సంస్థ. గుండారం కిష్టారెడ్డి, ధర్మారెడ్డి వంటి దొరలెందరో ఆ సంస్థని పెంచి, పోషించారు. 


నిజాం వ్యతిరేక పోరాటంలో...

మా ఊర్లో బడి లేదు. దాంతో 1943లో నేను పాతబస్తీలోని దారుల్షిఫా హైస్కూల్లో చేరాను. అప్పుడు మాకు నూరుల్‌ హసన్‌ హెడ్‌మాష్టారు ఉండేవారు. ఆయన ద్వారా నాకు మార్క్సిజం పరిచయమైం ది. అప్పటికే నేను ‘హిస్టరీ ఆఫ్‌ టిప్పుసుల్తాన్‌’ పుస్తకం చదవడంతో ఈస్టిండియా కంపెనీకి తొత్తులుగా మారిన ఆస్‌ఫజాహీల అసలు బుద్ధి నాకు కొంత బోధపడింది. భారత కమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో ఎస్‌.ఎ్‌స.ఎల్సీలో ఉండగా చదువు మానేసి, నిజాం వ్యతిరేక సాయుఽధ పోరాటంలోకెళ్లాను. 


తుపాకీ దొంగతనం...

1947లో ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు చెన్నమనేని రాజేశ్వరరావు కార్యదర్శిగా ఉండేవారు. అప్పుడు నేను నగర విద్యార్థి సంఘానికి సెక్రెటరీని. దాంతో ఆయనతో రెగ్యులర్‌గా పార్టీ కార్యకలాపాల గురించి చర్చిస్తుండేవాడిని. తర్వాత మగ్దూం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌, జావేద్‌ రిజ్వీతో కలిసి నేను, నా భార్య జహీరున్నీసా బేగం ఆసి్‌ఫనగర్‌లోని ఒక ఇంట్లో కొంతకాలం రహస్యజీవితం గడిపాం. ఆ సమయంలో ఉర్దూలో ఒక చేతిరాత పత్రిక కూడా తీసుకొచ్చాం. కమ్యూనిస్టు పార్టీ నాయకులు అమృతలాల్‌శుక్లా, చలసాని వాసుదేవరావులతో కలిసి కామారెడ్డి ప్రాంతంలో దళసభ్యుడిగానూ పనిచేశా. రజాకార్‌ నాయకుడు కాశీంరజ్వీ కొడుకు ఆసిఫ్‌ నాకు స్నేహితుడు. ఆ పరిచయంతో హైదరాబాద్‌లో తుపాకీలు, మందుగుండు సామగ్రి కొనుగోలు చేసి గ్రామాల్లోని సాయుధ పోరాట దళాలకు చేరవేసేవాడిని. ఒక సారి రజాకార్‌ సైన్యం నుంచి 12బోల్డు తుపాకీ, ఆరు కారె్ట్రడ్జులు (బుల్లెట్లు) దొంగిలించాను కూడా (నవ్వుతూ...). అదీ సాయుధ పోరాట దళాల కోసమే. పార్టీ కరపత్రాల ప్రచురణ కోసం ఛత్తా బజార్‌లోని ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ బండిల్స్‌ సేకరించి పంపేవాడిని. అవన్నీ తలచుకుంటుంటే ఇప్పుడు గర్వంగా అనిపిస్తోంది. 


కేసీఆర్‌ నాన్న కమ్యూనిస్టు...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాన్న రాఘవరావు కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడు. సిద్దిపేటలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి ఆయన ప్రతినెలా వచ్చి, బియ్యంబస్తా చందాగా ఇచ్చేవారు. సిద్దిపేట మొదటి ఎమ్మెల్యే గురవారెడ్డికి రాఘవరావు మంచి స్నేహితుడు. నిజాం వ్యతిరేక సాయుధపోరాటంలో పాల్గొన్నవాళ్లనూ స్వాతంత్య్ర సమరయోధులుగా ఇందిరా ప్రభుత్వం గుర్తించింది. అప్పుడు నేను దరఖాస్తు చేయలేదు. ‘ఆ ఏముందిలే’ అని నిర్లక్ష్యం చేశా.! సీపీఐ పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు 2004తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడి గుర్తింపు కోసం దరఖాస్తు చేశాను. అయితే, నేను ముస్లిం కనుక, నిజాంకి వ్యతిరేకంగా పోరాడడం అబద్ధం అనుకొని అప్పటి కేంద్ర హోంశాఖ నా దరఖాస్తుని తిరస్కరించింది. అంతేగాక, అక్కడున్న అధికారులు నా ఫైల్‌నే మాయం చేశారు. ఆ విషయం కేసీఆర్‌కి తెలిసింది. అప్పుడు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న ఆయన వెంటనే బి.వినోద్‌కుమార్‌ (ఇప్పుడు తెలంగాణ ప్లానింగ్‌ కమిషన్‌, ఉపాధ్యక్షుడు)ని పిలిచి ‘‘మొయినుద్దీన్‌ సాబ్‌ పని నీవు చూస్తవా. లేకుంటే నేను చూడాల్నా’’ అన్నారు. అంతే, కొద్దిరోజులకే నన్ను స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తిస్తూ, ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది. ఇప్పుడు ప్రతినెలా పింఛను కూడా వస్తోంది. అదంతా కేసీఆర్‌ చేసిన సాయంవల్లే.! 


కమ్యూనిస్టు పార్టీ ద్రోహం

కుల, మత రాజకీయాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అసలు దీనంతటికీ కారణం కమ్యూనిస్టు పార్టీలే. అవును! భారతదేశ ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ పెద్ద ద్రోహం చేసింది. కొందరు నాయకులు వ్యక్తిగతవాదంతో పార్టీని చీల్చారు. ఇప్పుడు ఒకే పార్టీ ఎన్ని ముక్కలు, చెక్కలయిందో మనందరికీ తెలిసిందే.! పార్టీ చీలిన తర్వాత ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడానికే సమయమంతా కేటాయించి, ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారు. మతతత్వ పార్టీల ప్రాబల్యం పెరగడానికి ప్రధాన కారణం వామపక్ష పార్టీల వైఫల్యమే.! 

Follow Us on:
Advertisement
Advertisement