175 మంది ఖైదీలకు స్వేచ్ఛ

ABN , First Publish Date - 2022-08-16T09:59:02+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా రాష్ట్రంలోని పలు జైళ్ల నుంచి 175 మంది ఖైదీలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది.

175 మంది ఖైదీలకు స్వేచ్ఛ

రాజమహేంద్రవరం నుంచి అత్యధికంగా 55 మంది విడుదల

అంతా హత్య కేసుల్లో శిక్షపడిన వారే

అక్కడ నుంచే 11 మంది మహిళా ఖైదీలకూ విముక్తి

మహిళా ఖైదీలకు స్వేచ్ఛ


రాజమహేంద్రవరం సిటీ, అమరావతి(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా రాష్ట్రంలోని పలు జైళ్ల నుంచి 175 మంది ఖైదీలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. క్షణికావేశంతో చేసిన తప్పులకు ఏళ్ల తరబడి ఖైదీలు జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు ఎందరో. వారిలో సత్‌ప్రవర్తన, అనారోగ్యం, వయో భారం ఆధారంగా జైళ్ల శాఖ సిఫార్సు చేసిన పేర్లను కమిటీ పరిశీలించింది. ప్రభుత్వానికి కమీటీ పంపిన ఆ జాబితాకు ఆమోద ముద్ర లభించింది. ఆమేరకు అత్యధికంగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి 55 మందికి విముక్తి లభించింది. విశాఖపట్నం నుంచి 33, కడప 31, నెల్లూరు 26, అనంతపురం వ్యవసాయక్షేత్రం నుంచి 15 మంది విడుదలయ్యారు. రాజమహేంద్రవరం మహిళా జైలు నుంచి 11 మంది బయటికి వచ్చారు. కడప, ఒంగోలు, పెనుకొండ, ధర్మవరం జైళ్ల నుంచి 11 మంది విడుదలయ్యారు. 


భావోద్వేగ వాతావరణం

ఖైదీల విడుదల సందర్భంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద భావోద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. జైలు బయట తమ కుటుంబాలను కలుసుకున్న విడుదలైన ఖైదీలు ఆనందోద్వేగంతో తబ్బిబ్బయ్యారు. ఆనందంతో వారిని కుటుంబ సభ్యులు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌ రాజారావు మాట్లాడారు. ‘‘విడుదలయిన 55 మంది ఖైదీలూ హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష పడి జైలులో శిక్ష అనుభవించిన వారే. కొంతమంది ఏడేళ్లు, మరికొంతమంది పదేళ్లు శిక్షా కాలం పూర్తి చేశారు. వారంతా వారి కాళ్లపై వారు నిలబడే విధంగా జైలులో ఉన్న పరిశ్రమల్లో, వివిధ పనుల్లో పూర్తిగా శిక్షణ పొందారు. నిరక్షరాస్యులుగా వచ్చిన ఖైదీలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు చదివించాం. అది ఉద్యోగాలు రావడానికి ఉపయోపడతుంది’’ అని అన్నారు. అనంతరం వికాశ తరంగణి ఆధ్వర్యంలో త్రిదిండి చినజీయర్‌స్వామి భక్త బృందం, డాక్టర్‌ రాజారామ్‌ 66 మంది ఖైదీలకు నూతన వస్త్రాలు అందించగా, జైలు సూపరింటెండెంట్‌ రాజారావు స్వీట్‌ ప్యాకెట్లను అందించి ఖైదీలకు వీడ్కోలు పలికారు. 


11 ఏళ్లుగా పిల్లలకు దూరమయ్యా

భూమి తగాదాల్లో మా బావతో జరిగిన గొడవలో బావ చనిపోయాడు. ఈ నేరానికి జీవిత ఖైదు పడింది. గత 11 ఏళ్లుగా జైలులో శిక్ష అనుభవించాను. అప్పుడు నా ఇద్దరు పిల్లలూ చిన్నవాళ్లు. వారి ఆలనపాలన చూడలేదనే బాధ నన్ను తొలచివేసింది. ఇప్పుడు నా పిల్లలను చూసుకోవాలి. క్షణికావేశంలో చేసిన పొరపాటుకు చాలా బాధపడ్డాను. జైలులో సంస్కరించారు. బతకడానికి అవసరమైన పనులు నేర్పారు.       - ఎస్‌కే ఖాజావలి, 

గుడిపాడు, గుంటూరు జిల్లా 



క్షమాభిక్ష నా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది 

హత్య కేసులో శిక్ష పడింది. నేను జైలుకు వచ్చేనాటికి నా కుమార్తె చిన్న పిల్ల. నా కుటుంబానికి దూరం గా చాలా ఇబ్బందులు పడ్డాను. జైలులో సత్ప్రవర్తనతో మెలిగాను. ఇప్పుడు నాకు క్షమాభిక్ష పెట్టడం నా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.                                                              - సత్యవతి, తణుకు 



నా పిల్లలు ఆదరిస్తారో లేదో..!

18 ఏళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నా. భార్య హత్య కేసులో జైలుకు వచ్చాను. జైలుకు వచ్చేసరికి నాకు చిన్నపిల్లలు ఉన్నారు. అటు తల్లి లేక... ఇటు నేను జైలుపాలయ్యి పిల్లలు చాలా బాధలు పడ్డారు. ఒక్కక్షణం ఆలోచించి ఉంటే ఈ దుస్థితి ఉండేదికాదు. నా పిల్లలిద్దరూ నా వదిన వద్ద ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళుతున్నా. నా పిల్లలు నన్ను ఆదరిస్తారో లేదో..!

-షేక్‌ ఖాసిం, తాడేపల్లి, కృష్ణా జిల్లా 


Updated Date - 2022-08-16T09:59:02+05:30 IST