ఫ్రీడం రన్‌ విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-09T05:33:45+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టనున్న ఫ్రీడం రన్‌ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

ఫ్రీడం రన్‌ విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, పాల్గొన్న అధికారులు, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు

- అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఆగస్టు 8: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టనున్న ఫ్రీడం రన్‌ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. సోమవారం ఆయన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ఈ నెల 11, 13, 14 తేదీల్లో, 16, 17 తేదీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సంబంధిత అధికారులు, స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో  11న అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు 30 వేల మందితో ఫ్రీడం రన్‌ నిర్వహించాలన్నారు. ఇందులో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. 13న అంబేద్కర్‌ స్టేడియం నుంచి టవర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని, 14వ తేదీన అమరవీరుల స్తూపం నుంచి ఆడిటోరియం వరకు కళాకారులతో ర్యాలీ, ప్రదర్శన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని సూచించారు. 11న నిర్వహించే ర్యాలీలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, డప్పు కళాకారులు పాల్గొనేలా చూడాలన్నారు. 16, 17 తేదీల్లో మండల స్థాయిలో ఆటల పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి 18వ తేదీన బహుమతులను ప్రదానం చేయాలని చెప్పారు. చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో 14వ తేదీన జానపద కళాకారులతో కార్యక్రమాలను నిర్వహించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ రవీందర్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, బీసీ వెల్ఫేర్‌ అధికారి రాజమనోహర్‌, ఎస్సీ వెల్ఫేర్‌ అధికారి నతానియేల్‌, డీఐవో రాజ్యలక్ష్మీ, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, ఎన్‌వైకే జిల్లా కో ఆర్డినేటర్‌ రాంబాబు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్‌రావు, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌రావు, టీఎన్‌జీవో జిల్లా ప్రెసిడెంట్‌ మారం జగదీశ్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:33:45+05:30 IST