ఉచితం.. అనుచితం

ABN , First Publish Date - 2022-01-26T07:53:00+05:30 IST

అధికారాన్ని దక్కించుకొనే తాపత్రయంలో ఎన్నికల ముందు అమలు సాధ్యంకాని ఉచిత హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలకు కళ్లెం వేసేందుకు సుప్రీంకోర్టు మరోసారి రంగంలోకి దిగింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని, దీనికి పరిష్కార మార్గమేంటో తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పింది....

ఉచితం.. అనుచితం

రాజకీయ పార్టీల ఉచిత హామీలకు కళ్లెమేసేదెలా?

నియంత్రించే మార్గం తెలుసుకోవాలనుకుంటున్నాం

ఉచితాలబడ్జెట్‌ అసలు బడ్జెట్‌ను దాటేస్తోంది

పార్టీల మధ్య సమానావకాశాలను దెబ్బ తీస్తోంది

సందేహం లేదు... ఇది చాలా తీవ్రమైన సమస్య

మ్యానిఫెస్టోకు మార్గదర్శకాలు రూపొందించాలని

మాకున్న పరిమిత అధికారంతో ఈసీకి చెప్పగలం

ఎనిమిదేళ్ల క్రితమే చెప్పినా ఇంతవరకు దిక్కులేదు

కేంద్రం, ఈసీలకు సుప్రీంకోర్టు  నోటీసులు

నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశం


న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): అధికారాన్ని దక్కించుకొనే తాపత్రయంలో ఎన్నికల ముందు అమలు సాధ్యంకాని ఉచిత హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలకు కళ్లెం వేసేందుకు సుప్రీంకోర్టు మరోసారి రంగంలోకి దిగింది. ఇది చాలా తీవ్రమైన సమస్య అని, దీనికి పరిష్కార మార్గమేంటో తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పింది. అహేతుకమైన ఉచిత హామీలకు కళ్లెం వేసేందుకు రాజకీయ పార్టీలతో మాట్లాడి, ఎన్నికల మ్యానిఫెస్టోల తయారీ విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని ఎనిమిదేళ్ల క్రితమే ఒక కేసులో ఎన్నికల సంఘానికి చెప్పామని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో ఒక సమావేశం కూడా నిర్వహించిందని, ఆ తర్వాత ఉచితాలను నియంత్రించే నిర్ణయమేదీ వెలువడినట్లు కనబడలేదని వ్యాఖ్యానించింది. 


తనకున్న పరిమిత అధికారాలతో మ్యానిఫెస్టో మార్గదర్శకాలను రూపొందించాలని మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆదేశించగలమని చెప్పింది. ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసం ఎప్పటికీ హామీలుగానే మిగిలిపోయే హామీలను ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూబీజేపీ నేత అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. పంజాబ్‌, యూపీ శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఆప్‌, అకాలీదళ్‌, కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎడాపెడా ఉచిత హామీలు గుప్పించిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.


ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఎ.ఎ్‌స.బోపన్న, జస్టిస్‌ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. 4 వారాల్లో సమాధానాలివ్వాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. సమస్య తీవ్రమైనదని అంగీకరిస్తూనే కేవలం కొన్ని రాష్ట్రాలను, కొన్ని రాజకీయ పార్టీలనే ప్రస్తావిస్తూ పిటిషన్‌ వేసిన ఆయన ఉద్దేశాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేరుస్తానని పిటిషనర్‌ సమాధానం ఇవ్వడంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రస్తుతానికి కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇస్తామని ప్రకటించి, విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.


ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ స్పందిస్తూ, ‘‘ఇది చాలా సీరియస్‌ అంశమనే విషయంలో ఎలాంటి సందే హం లేదు. ఉచిత హామీల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌ను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉచితాల కారణంగా కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బరిలో సమాన అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. దీన్ని ఎలా నియంత్రించగలమో అన్వేషించాలని అనుకుంటున్నాం’’ అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలు ఇవ్వడాన్ని అవినీతి చర్యలుగా పరిగణించలేమని 2013లో తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సంఘాన్నే మ్యానిఫెస్టోల్లో ఏం ఉండొచ్చనే దానిపై మార్గదర్శకాలు రూపొందించమని చెప్పామని, ఎన్నికల కోడ్‌లో దీన్ని భాగంగా కూడా చేర్చమని సూచించామని గుర్తు చేశారు. 


తమాషాగా మార్చేశారు

నిర్హేతుకమైన ఉచిత హామీలను ఇవ్వడం, అధికారంలో ఉంటే ఎన్నికల ముందు ప్రజాధనంతో వాటిని పంచిపెట్టడం రాజకీయ పార్టీలకు తమాషాగా మారిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వికా్‌ససింగ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలకు కఠిన నియమ నిబంధనలను పెట్టాలని, గీత దాటిన పార్టీల గుర్తింపును రద్దు చేయాలని, ఎన్నికల గుర్తులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ‘‘దశాబ్దాలుగా తమాషా కొనసాగుతోంది. హామీలు హామీలుగానే ఉండిపోతున్నాయి. కొన్ని ఉచితాలు తప్ప మిగతావేవీ ఎప్పటికీ అమలు కావు. ఇలా ఉచితాలు హామీలుగా ప్రకటించడం ఓటర్లను లంచంతో మభ్యపెట్టడమే అవుతుంది’’ అని పిటిషనర్‌ వ్యాఖ్యానించారు.


నిండా అప్పుల్లో మునిగిన రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచిత హామీలను గుప్పిస్తున్నాయని, ఎన్నికల్లో అవతలి పార్టీకి సమాన అవకాశాలు దక్కకుండా చేయడం ఈ హామీల లక్ష్యమని వికాస్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ‘‘వీళ్లు ఇస్తున్నది, హామీలిస్తున్నది ఎవరి డబ్బు? ప్రజలది. కొన్ని రాష్ట్రాలు పౌరుల ఒక్కొక్కరి తలపై రూ.3 లక్షల అప్పు చేశాయి. ఇంకా ఉచిత  హామీలు గుప్పిస్తున్నాయి’’ అన్నారు. 2013లో సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎన్నికల సంఘం ఉచితాలపై కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందని, అయితే అవి కోరల్లేనివిగా తయారయ్యాయని అన్నారు.


ఎన్నికల ముందు ప్రజాధనంతో అహేతుకమైన ఉచితాలను పంచిపెట్టడం, హామీ ఇవ్వడం అనేది ఓటర్లును మభ్యపెట్టడమే అవుతుందని చెప్పారు. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుతమైన ఎన్నికల మౌలిక భావనను దెబ్బ తీసుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బ తింటుందని, రాజ్యాంగంలోని 14, 162, 266(3), 282 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినట్లవుతుందని చెప్పారు. గతంలో ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, మార్గదర్శకాలను రూపొందించిందని, పార్టీల మ్యానిఫెస్టోలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే విధంగా ఉండరాదని ఆ మార్గదర్శకాలు చెబుతున్నాయని వికా్‌ససింగ్‌ అన్నారు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు రాష్ట్రాలను ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపట్టాలని నిర్దేశించిందని, అందువల్ల రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాలను ప్రకటించవచ్చని ఎన్నికల సంఘం చెప్పిందని ప్రస్తావించారు.


ఎన్నికల ప్రక్రియ పవిత్రతను దెబ్బతీసే, ఓటు వేసే క్రమంలో ఓటరును అనుచితంగా ప్రభావితం చేసే హామీలను ఇవ్వరాదని రాజకీయ పార్టీలను కోరిందని చెప్పారు. పారదర్శకత, అన్ని రాజకీయ పక్షాలకు సమానావకాశాలు కల్పించడం కోసం, హామీలకు విశ్వసనీయత కల్పించడం కోసం రాజకీయ పార్టీలకు మ్యానిఫెస్టో రూపకల్పన విషయంలో కొన్ని సూచనలు చేసిందని ప్రస్తావించారు. ‘‘హామీలు హేతుబద్ధంగా ఉండాలని చెప్పింది. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాలని కోరింది. అమలు సాధ్యమైన హామీల ద్వారా మాత్రమే ప్రజల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేయాలని సూచించింది’’ అని గుర్తు చేశారు. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం బాధ్యతని, అహేతుకమైన ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఎన్నికల సంఘం మౌలిక విధులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. ప్రజల సొమ్ముతో బహుళ ప్రజోపయోగం ఏమీలేని వ్యక్తిగత వస్తువులు, సేవలు అందించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు.


మెరుగైన చట్టబద్ధ పాలన, సమాన పనికి సమాన వేతనం, స్వచ్ఛమైన నీళ్లు, అందరికీ ఒకేరకమైన నాణ్యమైన విద్య అందించడం, నాణమైన వైద్య సౌకర్యాలు కల్పించడం, సత్వర న్యాయం, ఉచిత న్యాయ సహాయం, పౌర సేవల చార్టర్‌, న్యాయ సేవల చార్టర్‌, సమర్థ పోలీసు యంత్రాంగం, ప్రభావవంతమైన పాలనా యంత్రాంగం లాంటి హామీలు ఇవ్వాల్సిన రాజకీయ పార్టీలు ఏకపక్షంగా ప్రజాధనంతో అహేతుక హామీలను గుప్పిస్తున్నాయని ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి పునాది. ఎన్నికల ప్రక్రియ నిజాయితీలో రాజీ పడితే ప్రజాప్రాతినిథ్యం అనే భావనే అర్థరహితం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు పంచడం, ఉచిత హామీలు ఇవ్వడం ప్రమాదకర స్థాయికి చేరాయని చెప్పారు. ఈ కారణంతోనే పలుసార్లు ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. 


పంజాబ్‌, యూపీల్లో!

 పంజాబ్‌లో పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతీ మహిళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. వెంటనే అకాలీదళ్‌ రెండు వేలు ఇస్తామని ప్రకటించింది. 

 కాంగ్రెస్‌ రూ.2000కు తోడుగా ఏడాదికి 8 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, కళాశాలకు వెళ్లే ప్రతీ అమ్మాయికి స్కూటీ ఇస్తామని, 12వ తరగతి పాస్‌ అయితే 20 వేలు, పదో తరగతి నెగ్గితే 15 వేలు, 8వ తరగతి దాటితే 10 వేలు, 5వ తరగతి దాటితే రూ.5 వేలు ఇస్తామని చెప్పింది. 

 ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 12వ తరగతి చదివే బాలికకు స్మార్ట్‌ ఫోన్‌, డిగ్రీ చదివే బాలికకు స్కూటీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటికి ఎనిమిది గ్యాస్‌ సిలిండర్లు, ఇంటికి పది లక్షల వరకు వైద్య బీమా హామీ ఇచ్చింది. 

 ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రతీ కుటుంబానికి 300 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పింది. ప్రతీ మహిళకు రూ.1500 పెన్షన్‌ ఇస్తామని ప్రకటించింది. సైకిల్‌ తొక్కుతూ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు బీమా చెల్లిస్తామని ప్రకటించింది. 

 ఆప్‌ హామీలు అమలు చేయాలంటే పంజాబ్‌ సర్కారుకు నెలకు రూ..12 వేల కోట్లు కావాలి. అకాలీదళ్‌ హామీలకు రూ.25 వేల కోట్లు కావాలి. కాంగ్రెస్‌ హామీలకు రూ.30 వేల కోట్లు కావాలి. ఆ రాష్ట్రం నెలవారీ జీఎస్టీ ఆదాయం కేవలం 1400 కోట్లు. ఇప్పుడున్న అప్పుల వాయిదాలు చెల్లించిన తర్వాత జీతాలు చెల్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఇక ఉచిత హామీలు నెరవేర్చడం అసంభవం. 


ఇది చాలా సీరియస్‌ అంశమనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఉచిత హామీల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌ను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉచితాల కారణంగా కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బరిలో సమాన అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. దీన్ని ఎలా నియంత్రించగలమో అన్వేషించాలని అనుకుంటున్నాం.

- సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

Updated Date - 2022-01-26T07:53:00+05:30 IST