తలముడిపిలో మంచినీటి ఎద్దడి

ABN , First Publish Date - 2022-01-18T05:12:21+05:30 IST

మండలంలోని తలముడిపి పంచాయతీ కేంద్రంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. నాలుగు నెలలుగా మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి ఉన్న మంచినీటి బోరు మోటారు కాలిపోయి నాలుగు నెలలు అయినా మరమ్మతులకు నోచుకోలేదు.

తలముడిపిలో మంచినీటి ఎద్దడి
ఖాళీ బిందెలతో తాగునీటి బోరు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల నిరసన

గాలివీడు, జనవరి 17: మండలంలోని తలముడిపి పంచాయతీ కేంద్రంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. నాలుగు నెలలుగా మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి ఉన్న మంచినీటి బోరు మోటారు కాలిపోయి నాలుగు నెలలు అయినా మరమ్మతులకు నోచుకోలేదు. సోమవారం గ్రామస్తులు తాగునీటి బోరు ఎదురుగా ఉన్న రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వంద గృహాలతో పాటు దాదాపు 400 మూగజీవాలు ఉన్నాయి. వీటన్నింటికీ నీటి సౌకర్యం కల్పించాలంటే గగనమైపోతోందని   వాపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. విధిలేని పరిస్థితిలో చందాలు వేసుకుని చేతి పంపును తయారు చేయించుకున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

Updated Date - 2022-01-18T05:12:21+05:30 IST