ఏనుగు స్నేహం

ABN , First Publish Date - 2020-11-24T05:30:00+05:30 IST

ఒక ఏనుగు దారితప్పిపోయి కొత్త అడవిలోకి ప్రవేశించింది. ఇతర జంతువులు కనిపిస్తే వాటితో స్నేహం చేయాలనుకుంది. ఒకచోట కోతి కనిపిస్తే ‘మనం స్నేహితులుగా ఉందామా?’ అని అడిగింది. అప్పుడు ఆ కోతి ‘నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. చెట్లపై దూకలేవు. కాబట్టి మనం స్నేహితులు కాలేము’ అంది...

ఏనుగు స్నేహం

ఒక ఏనుగు దారితప్పిపోయి కొత్త అడవిలోకి ప్రవేశించింది. ఇతర జంతువులు కనిపిస్తే వాటితో స్నేహం చేయాలనుకుంది. ఒకచోట కోతి కనిపిస్తే ‘మనం స్నేహితులుగా ఉందామా?’ అని అడిగింది. అప్పుడు ఆ కోతి ‘నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. చెట్లపై దూకలేవు. కాబట్టి మనం స్నేహితులు కాలేము’ అంది. మరి కాస్త దూరం వెళ్లాక ఏనుగుకి కుందేలు కనిపించింది.


కుందేలును అలాగే అడిగింది. అప్పుడా కుందేలు ‘నువ్వు నా బొరియల్లోకి రాలేవు. కాబట్టి నువ్వు నా ఫ్రెండ్‌వి కాలేవు’ అంది. ఇంకాస్త దూరం వెళ్లాక కప్పనూ అడిగింది. ‘నువ్వు నాలా గెంత లేవు. నన్ను క్షమించు. నేను నీతో స్నేహం చేయలేను’ అని కప్ప సమాధానమిచ్చింది.  ఒక్క జంతువు కూడా ఏనుగుతో స్నేహం చేయడానికి ముందుకు రాలేదు. మరుసటి రోజు అడవిలో జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు పెడుతుండటాన్ని ఏనుగు గమనించింది. ‘ఏం జరిగింది’అని ఓ జంతువును అడిగింది.‘పులి చిన్న చిన్న జంతువులన్నింటిపై దాడి చేస్తోంది’అని చెప్పింది. వెంటనే ఏనుగు ఆ జంతువులను కాపాడేందుకు వెళ్లింది. పులి దగ్గరకు వెళ్లి ‘నా స్నేహితులను వదిలేయ్‌’ అని అడిగింది. కానీ పులి ఒప్పుకోలేదు. ఏనుగు తన తొండంతో పులిని ఎత్తి, దూరంగా విసిరేసింది. అప్పుడు ప్రాణభయంతో పులి పరుగెత్తింది. అప్పటి నుంచి జంతువులన్నీ ఆ ఏనుగుతో స్నేహం చేశాయి. ‘మాతో స్నేహం చేయడానికి నీదే సరైన ఎత్తు’ అని అన్నాయి జంతువులన్నీ. 

Updated Date - 2020-11-24T05:30:00+05:30 IST