ఫేస్‌బుక్‌ ముసుగులో మోసం

ABN , First Publish Date - 2022-05-23T07:16:49+05:30 IST

ఓ వివాహిత పేరిట ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచాడు. తానూ మహిళగా.. అమ్మాయిలను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న నిందితుడిని ఐరాల పోలీసులు అరెస్టు చేశారు.

ఫేస్‌బుక్‌ ముసుగులో మోసం
అనిల్‌ను అరెస్టు చూపుతున్న పోలీసులు

 మహిళ పేరిట అకౌంట్‌ ప్రారంభం 

అమ్మాయిలతో స్నేహం.. ఆపై అసభ్యకర మెసేజ్‌లు 

నిందితుడి అరెస్టు 


ఐరాల, మే 22: ఓ వివాహిత పేరిట ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచాడు. తానూ మహిళగా.. అమ్మాయిలను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న నిందితుడిని ఐరాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఆదివారం ఎస్‌ఐ హరిప్రసాద్‌ మీడియాకు వివరించారు. ఆ ప్రకారం.. ఐరాల మండలానికి చెందిన ఓ వివాహిత పేరుతో తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లెకు చెందిన అనిల్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచాడు. అమ్మాయిలతో స్నేహం చేస్తు వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించే వాడు. దీంతో పాటు వారికి అసభ్యకరమైన ఫొటోలను.. మెసేజ్‌లు పెట్టేవాడు. ఈ విషయాన్ని గమనించి ఆ వివాహిత మార్చిలో ఐరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రహస్యంగా ఆ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఐపీ అడ్రస్‌ ద్వారా ఆరా తీయడం ప్రారంభించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అనిల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలను మభ్యపెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని ఇంటి వద్ద ఆదివారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫేస్‌బుక్‌ను వినియోగించే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ హరిప్రసాద్‌ సూచించారు. ఇలాంటి నయవంచకుల మాటల భ్రమలోపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు ఏవైనా ఉంటే ధైర్యంగా తమకు తెలియజేస్తే వారిని కాపాడతామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-05-23T07:16:49+05:30 IST